Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ ప్రసంగం లేకుండానే ఉభయ సభలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 7నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలు ఉదయం 11.30గంటలకు ప్రారంభమవుతాయని శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేరోజు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు 2022-23 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మంత్రిమండలి ఈనెల6న సిఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 5గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశంకానుంది. బడ్జెట్ సెషన్ ఎజెండా, సభ ఎన్ని రోజులు జరగాలనేది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయిస్తారు. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మంత్రులు హరీశ్‌రావు, కే తారకరామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులుతో సమావేశ మయ్యారు. బడ్జెట్ సమావేశాల ముహూర్తాన్ని ఖరారు చేశారు.
గవర్నర్ ప్రసంగం లేకుండానే...
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం అనేది రాజ్యాంగ ప్రక్రియ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలు కూడా రాష్ట్రపతి ప్రసంగం తర్వాతే ప్రారంభమవుతాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంలో అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. ఈసారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు దానికి భిన్నంగా ప్రారంభంకానున్నాయి. గవర్నర్ ప్రసంగం ఉండదు. శాసనసభను స్పీకర్, మండలిని చైర్మెన్ సమావేశపరుస్తారు. తెలంగాణ రెండవ శాసనసభ ఎనిమిదవ సమావేశం 2021 అక్టోబర్ 8న జరిగింది. దీన్ని అసెంబ్లీ స్పీకర్ నిరవధిక వాయిదా (ప్రొరోగ్) వేయలేదు. అందువల్ల సాంకేతికంగా శాసనసభ తదుపరి సమావేశాలు 'అక్టోబర్ 8 నాటి' సభకు కొనసాగింపుగానే ప్రారంభమవుతాయి. దీనివల్ల బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే స్పీకర్ నేరుగా ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఈనెల 7 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత సభ ప్రోరోగ్ అయితే, తర్వాత జరిగే సెషన్.. ఉభయ సభల సంయుక్త సమావేశంతో గవర్నర్ ప్రారంభించాల్సి ఉంటుంది. గతేడాది 2020-21 బడ్జెట్ సమావేశాల సందర్భంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో అక్కడి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కిరణ్ బేడీ పాండిచ్చేరి గవర్నర్‌గా ఉన్న సమయంలో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 1970, 2014లో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.