Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం బల్క్ డీజిల్ ధరలను పెంచడం వల్ల రాష్ట్రంలో ఆర్టీసీపై పెనుభారం పడుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజారవాణా, తదితర రంగాలు సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో ఈ ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీపై పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని బల్క్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు. అప్పటి వరకు ఆర్టీసీపై పడుతున్న భారాన్ని తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా బల్క్ డీజిల్ ధరలను లీటరుకు రూ.7 పెంచిందని గుర్తు చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీపై పెనుభారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఏటా సుమారు 47 కోట్ల లీటర్ల డీజిల్‌ను ఖర్చు చేస్తుందని తెలిపారు. ఆయిల్ కంపెనీలతో ఆర్టీసీ చేసుకున్న ఒప్పందం కారణంగా లీటరుకు రూ.4.65లు భారం పడనుందని వివరించారు. ఈ పెంపువల్ల ఆర్టీసీపై రోజుకి రూ.28లక్షలు, ఏడాదికి రూ.వంద కోట్ల వరకు భారం పడుతుందని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఈ ధరలు ఇంకా పెద్దఎత్తున పెరిగి ఆ సంస్థపై ఇంధనభారం విపరీతంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసి మరింత నష్టాల్లోకి కూరుకుపోతుందని తెలిపారు.