Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు
- జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాజంలో రోజురోజుకు మూఢవిశ్వాసాలు పెరుగుతున్నాయని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆ సంస్థ కార్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేవీవీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోగమిస్తున్నదని చెప్పారు. మరోవైపు గ్రామాలు, పల్లెలను మూఢవిశ్వాసాలు పట్టిపీడిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేతబడి, బాణామతి, మంత్రాల నెపంతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా జనవిజ్ఞాన వేదిక గత 34 ఏండ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నదని వివరించారు. వాటిని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరముందని సూచించారు. మూఢనమ్మకాలను అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సైన్స్‌తో ప్రగతి సాధ్యమనీ, సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ హైదరాబాద్ నగర నాయకులు లింగస్వామి, విద్యాసాగర్, భీమేశ్వరరావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.