Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనపర్తిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న 'మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడి' కార్యక్రమాన్ని ఈనెల ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. అదేరోజు ఆయన వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు. ఆ జిల్లా కేంద్రం నుంచి 'మన ఊరు-మనబడి' కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం కన్నెతండా లిఫ్టును, వనపర్తిలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును సీఎం ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేయబోయే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు.
బడుల అభివృద్ధికి రూ.7,289 కోట్లు ఖర్చు
'మన ఊరు-మన బడి' కార్యక్రమం ద్వారా మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18,240 ప్రాథమిక, 3,164 ప్రాథమికోన్నత, 4,661 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 26,065 స్కూళ్ల అభివృద్ధికి రూ.7,289.54 కోట్లు ఖర్చు చేయనుంది. అత్యధికంగా విద్యార్థులుండే 9,123 (35 శాతం) స్కూళ్లను తొలి దశలో ఎంపిక చేసింది. వాటిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కార్యక్రమం కింద 12 రకాల అంశాలను పటిష్టపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగు నీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నీచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, పెద్ద, చిన్న మరమ్మత్తులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహారీ గోడలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు, డిజిటల్ విద్య అమలు వంటివి అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది.
ప్రజలకు సీఎం కేసీఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. నిబద్ధతకు, అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఉపవాస దీక్షలతో జాగారాలతో శివరాత్రి పండుగను హిందువులు జరుపుకుంటారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సృష్టి లయకారునిగా శివున్ని భక్తి ప్రవృత్తులతో కొలుచుకుంటారని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలకు ఆ మహాశివుడు ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరారు.