Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల గణనలో కేంద్రం నిర్లక్ష్యం : బీసీ హక్కుల సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల లెక్కలు సేకరించటంలో ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని వక్తలు విమర్శించారు.సోమవారం హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో బీసీ హక్కుల సాధన సమితి నాయకులు పాండురంగాచారి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ముందుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించకపోవటం బీసీలను అన్యాయం చేయటమేనని చెప్పారు. 'నేను బీసీని, చారువాలాను'అని చెప్పుకుంటున్న ప్రధాని బీసీలకు ఎలా అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. 75ఏండ్ల స్వతంత్య్ర భారతంలో ఇప్పటికీ కులం, మతం, సెంట్మెంట్ను రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జనగణన చేస్తవా? చేయవా? అని ప్రజలు నిలదీసేలా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఫెడరేషన్లన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారాయని విమర్శించారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అసలు వృత్తులు ఎంటి? వారి జీవన విధానం ఏంటనే విషయం పాలకులకు అర్థం కావాలంటే జనగణన చేయాల్సిందేనని చెప్పారు. పూలె అంబేద్కర్ రాజ్యాధికార సమితి అధ్యక్షులు కోలా జనార్ధన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పాలకులు పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనీ, వారికి ప్రజల బాధలు పట్టటం లేదని విమర్శించారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ రాజ్యాంగ సూత్రాలను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని వివరించారు.కుల గణన జరిగితే వాటా సమస్య ముందుకొస్తున్నదని అధికార పార్టీలు గ్రహించాయని చెప్పారు. అందుకే తాత్సారం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు అజీజ్పాషాతో పాటు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.