Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 16 నుంచి తొలి, మే 24 నుంచి రెండోవిడత షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీ, త్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఈ ఏడాది రెండు విడతల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. ఈ మేరకు ఎన్టీఏ సీనియర్ డైరెక్టర్ (ఎగ్జామ్స్) సాధనా పరాషర్ మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ 16,17,18,19,20,21 తేదీల్లో జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మే 24 నుంచి 29వ తేదీ వరకు రెండోవిడత పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2019, 2020లో జేఈఈ మెయిన్స్ రెండు విడతల్లో, గతేడాది మాత్రం నాలుగు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థుల నుంచి ఎక్కువ స్పందన రాకపోవడంతో ఈ ఏడాది రెండువిడతల్లోనే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2.50 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. జేఈఈ మెయిన్స్ తొలివిడత కోసం ఈనెల 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు గడువుందని తెలిపారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ జులై మూడో తేదీన జరగనుంది.