Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4వందల కిలోల గంజాయి పట్టివేత
- రూ. 1.10 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
- నిందితుల నుంచి కారు,
- లారీ, బంగారం, మొబైల్స్ నగదు స్వాధీనం :
డీసీపీ జగదీశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-శంషాబాద్
నిషేధించబడిన గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ బృందం, చేవెళ్ల పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం వారి వద్ద నుంచి గంజాయి, వాహనాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంకు చెందిన సుభాన్, బాషా ఏజెన్సీ నుంచి గంజాయి సరఫరా చేసే ప్రధాన నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెందిన 8 మంది నిందితులు ఒక ముఠాగా ఏర్పడి టోల్గేట్లో చిక్కకుండా ఇతర మార్గాల ద్వారా పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తుంటారు. అలా ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి 400 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టారు. మహారాష్ట్రకు చెందిన పరశురాం ఆనంద పరకాలే (57), ఉమేష్ గైక్వాడ్ (38), ప్రదీప్ కలంగి, దత్త సకత్ (53) సతీష్ విజరు షిండే (36), విశాల్ పుప్పట్ మట్కే (21) అశోక్ పట్పుటే (50), అంకుష్ పండులే.. ఖమ్మం ఏజెన్సీ నుంచి మహరాష్ట్రలోని అంకుష్‌కి ఈ గంజాయిని చేరవేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన విశాల్ సంబంధిత పార్టీల అభ్యర్థన మేరకు అక్రమ గంజాయి లోడ్ వాహనాలను వివిధ ప్రాంతాలకు సప్లరు చేస్తాడు. వచ్చిన లాభాల్లో వాటా తీసుకుంటారు. వినియోగదారులకు విక్రయించడం కోసం లారీలో గంజాయిని దాచేందుకు ప్రత్యేక క్యాబిన్‌ను సిద్ధం చేశారు. ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రెండింటిలోనూ నిశిత నిఘా ఉన్నందున, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు అవసరమైన గంజాయిని రవాణా చేయడంలో తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఫిబ్రవరి 22న ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలోని ఒక మారుమూల ప్రదేశంలో గంజాయి లోడు నింపారు. అనంతరం ఎవ్వరూ గుర్తించకుండా ఎప్పటిలాగే లారీని తీసుకుని ఫిబ్రవరి 27 తెల్లవారుజామున ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు బయలుదేరారు. వారు టోల్గేట్లు తప్పించుకునేందుకు వివిధ ప్రాంతాలు తిరిగారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫిబ్రవరి 28 తెల్లవారుజామున శంషాబాద్ జోన్ ఎస్ఓటీ, చేవెళ్ల పోలీసుల సంయుక్త బృందం చేవెళ్ల పీఎస్ పరిధిలోని షాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద లారీతో పాటు ఎర్టిగా వాహనాలను అడ్డగించి వివరాలు అడిగారు. వెంటనే లారీని పట్టుకుని కారు, లారీతో పాటు 4 వందల కేజీల గంజాయినీ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ.1.10కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.