Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిలో అంతర్గత ఫిర్యాదుల మహిళా కమిటీలు వేయాలి :
ఎస్వీ రమ
- సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్, చైర్మెన్ శ్రీధర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రామగుండం-1 ఏరియా వర్కుషాపులో మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కె.స్వామిదాసుపై సింగరేణి యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా సమన్వయ కమిటీ(సీఐటీయూ అనుబంధం) కన్వీనర్ ఎస్వీ రమ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సింగరేణి సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రీకాంత్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. సింగరేణి వ్యాప్తంగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న పని ప్రాంతాల్లో అంతర్గత ఫిర్యాదుల మహిళా కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. లైంగిక వేధింపులపై సదరు మహిళా ఉద్యోగిని ఇప్పటికే స్థానిక అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేయడం ఎందుకని ప్రశ్నించారు. భర్తలు చనిపోయి డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌లో భాగంగా ఉద్యోగంలో చేరిన ఒంటరి మహిళల అవసరాలను, ఇబ్బందులను ఆసరా చేసుకుని కొందరు అధికార సంఘం పేరుతో వేధింపులకు పాల్పడుతున్న దుర్మార్గపూరిత చర్యలను ఖండించారు. పనిప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, సమన్వయ కమిటీ సభ్యులు ఆర్.వాణి, ఎం.మీనా, ఎ. సునీతలు పాల్గొన్నారు.