Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన ఊరు-మనబడిని సమర్థవంతంగా అమలు చేయాలి
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యావిధానం-2020ని అమలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర విస్తృత సమావేశం డిమాండ్ చేసింది. దేశంలో విద్యా ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తూ, రాష్ట్రాల హక్కులను హరించి విద్యపై కేంద్రం పెత్తనాన్ని పెంచేలా, లౌకికతత్వానికి విఘాతం కలిగించేలా ఈ విధానం ఉందని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించే 'మన ఊరు-మనబడి' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరింది. గతనెల 27,28 తేదీల్లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ విస్తత సమావేశాలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగాయి. ఈ సందర్భంగా చేసిన తీర్మానాలు, నిర్ణయాలను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి మంగళవారం హైదరాబాద్‌లో మీడియాకు విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సమాంతరంగా ఇంగ్లీషు మీడియాన్ని ప్రారంభించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 21,500 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంగ్లీషు మీడియం కోసం అదనంగా అవసరమైన ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు చేపట్టాలని కోరారు. పాఠశాల విద్యలో కీలకమైన పర్యవేక్షణాధికారుల ఖాళీలు భర్తీ చేయాలని సూచించారు. అన్ని జిల్లాలకూ రెగ్యులర్ డీఈవోలను, నియోజకవర్గానికి ఒక డిప్యూటీ ఈవో, ప్రతి మండలానికీ ఒక ఎంఈవో పోస్టును మంజూరు చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడేండ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు, నాలుగేండ్లుగా జరగని సాధారణ బదిలీలకు వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సివిల్ సర్వీసు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని తీర్మానించామని వివరించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పటిష్టపరచాలనీ, అన్ని ప్రభుత్వ శాఖల్లోని రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం ప్రభుత్వ బాధ్యతగా అందించాలని కోరారు. అవసరమైతే ప్రభుత్వ వైద్యశాలలనే కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేసి ప్రజలందరితోపాటు ఉద్యోగులకూ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఉద్యోగుల నుంచి ఒక శాతం, లేదా రెండు శాతం చందా వసూలు చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల్లో పనిభారాన్ని తగ్గించాలనీ, సాధారణ ఉపాధ్యాయులకంటే అదనపు వేతనాలు నిర్ణయించాలని తెలిపారు. కేజీబీవీ ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలనీ, గిరిజన సంక్షేమ పాఠశాలలకు అదనపు పోస్టులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలనీ, విద్యారంగ అభివృద్ధికి సంబంధించి 12, ఉపాధ్యాయుల సర్వీసులకు సంబంధించిన 20 కలిపి మొత్తం 36 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించామని వివరించారు. ఈనెల 14 నుంచి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల శాఖల ఆధ్వర్యంలో పాఠశాలలు పర్యటించి సమస్యలపై సర్వే నిర్వహించాలని తెలిపారు. ఏప్రిల్‌లో క్రోడీకరించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులకు ప్రాతినిధ్యం చేయాలనీ, పరిష్కారం కాకపోతే దశలవారీ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.