Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ, ఐద్వా, యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7,8,9 తేదీల్లో 'యాక్షన్డే'గా నిర్వహించనున్నట్టు సీఐటీయూ,ఐద్వా, టీఎస్‌యూటీఎఫ్ సంఘాల సంయుక్త సమావేశం నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆయా సంఘాల సమావేశం ఆర్ అరుణజ్యోతి అధ్యక్షతన జరిగింది. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ (సీఐటీయూ) కన్వీనర్ ఎస్వి రమ, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి,వందన, అంకమ్మ, కల్పన, చలం, మీన, లక్ష్మిదేవమ్మ, శశికళ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 8న వీఎస్టీ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు మహిళా ప్రదర్శన, ఆ తర్వాత ఎస్వీకేలో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 28,29 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సమ్మె సన్నాహకంలో భాగంగా జరుపుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో శ్రామిక మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు, డిమాండ్లు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విధ్వంసకరంగా ఉందని విమర్శించారు. మహిళల భద్రతకు కేంద్ర ప్రభుత్వం భంగం కలిగిస్తున్నదని సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి వ్యతిరేకంగా తీసుకొచ్చే తిరోగమన విధానాలను, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్న మతవాద ఎజెండాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లో హిజాబ్ ను నిషేదించటం తగదని చెప్పారు.మహిళల వివాహ వయస్సు పెంచటం లాంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వారు తెలిపారు.