Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిలబస్‌ను వేగంగా పూర్తి చేయాలంటున్న ఇంటర్ బోర్డు
- అదేపనిలో నిమగమైన అధ్యాపకులు
- ఈనెల 23 నుంచి ప్రాక్టికల్స్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ సహా ఉన్నతవిద్యకు వెళ్లాలంటే ఇంటర్ విద్య ఎంతో కీలకం. అందుకే ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తుపైనే ఇంటర్ బోర్డు అధికారులు దృష్టి కేంద్రీకరించారు. కరోనా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలను ప్రారంభించేందుకు వీలుగా ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంకోవైపు ఈనెల 23 నుంచి ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు ఇంటర్మీడియెట్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. దీంతో సిలబస్‌ను వేగంగా పూర్తి చేయడంపై ఇంటర్ బోర్డు అధికారులు దృష్టిసారించారు. ఈనెల 20 నాటికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల సిలబస్‌ను పూర్తి చేయాలని అధ్యాపకులను ఆదేశించారు. ఈనెలాఖరునాటికి ఇంటర్ ఫస్టియర్‌తోపాటు, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఆర్ట్స్, కామర్స్ సిలబస్‌ను పూర్తి చేయనున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధ్యాపకులు ఇదే పనిలో నిమగమయ్యారు. ఇప్పటికే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆయా పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే దిశగా ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే సిలబస్‌ను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా అధ్యాపకులు, డీఐఈవోలను కోరుతున్నారు. ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గతేడాది పదో తరగతి పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. ఇక ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఫస్టియర్ పరీక్షలు రాయకుండానే ప్రమోట్ అయ్యారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరంలో అక్టోబర్‌లో నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 2,24,012 (49 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2,35,230 (51 శాతం) మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం స్పందించి ఫెయిలైన 2.35 లక్షల మంది విద్యార్థులందర్నీ కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులంతా ఫస్టియర్‌లో పాసయ్యారు. కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరంలోనూ 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రశ్నాపత్రంలోనూ విద్యార్థులకు ఛాయిస్ పెరగనుంది.