Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాట తప్పిన సర్కారు
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 135 పంచాయతీలు ఏకగ్రీవం
- అందాల్సిన ప్రోత్సాహక నిధులు రూ.25 కోట్లు
- నిధులపై ఆశ వద్దంటున్న పంచాయతీ అధికారులు
- ఉసూరుమంటున్న గ్రామ సర్పంచ్‌లు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్‌కు వెళ్లకుండా ప్రజలంతా ఐక్యతను చాటుతూ ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకున్న పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్న ప్రభుత్వం చేతులెత్తింది. ఇదే ఆంశంపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతో ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 10లక్షలు ఇస్తామని మీమేమీ చెప్పలేదని మంత్రి కేటీఆర్ వాదించారు. ఇటీవల పంచాయతీ అధికారులకు సైతం సీఎం కేసీఆర్ ప్రోత్సాహకాలాంటివీ ఏమీ లేవు.. ఇకపై అలాంటి ఆశలు పెట్టుకోవద్దని పంచాయతీ అధికారులు తెగేసి చెప్పారు. దాంతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచుల ఆశలపై నీళ్లు చల్లినట్లైయింది. పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు వస్తాయన్న ఆశతో ఎదురుచుస్తున్న గ్రామస్తులకు విషయం తెలవడంతో ఉసూరుమంటున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1187 పంచాయతీలకు గాను 2019 ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 135 మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వికారాబాద్‌లో 566 పంచాయతీలకు గాను 75, రంగారెడ్డిలో 560 పంచాయతీలకు 53, మేడ్చల్‌లో 61 పంచాయతీలకు 07 మాత్రమే ఏకగ్రీవమైనట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక అయితేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. ఓటింగ్ ఖర్చు తగ్గుతుందన్నారు. తమ గ్రామాలకు ప్రోత్సాహక నిధులు వస్తే సమస్యలు పరిష్కరించుకోవచ్చనే ఆశతో అనేక పంచాయతీల్లో గ్రామస్తులు పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల్లో పోటీపడి ఘర్షణ వాతావరణం తలెత్తడం లాంటివి ఎందుకని భావించిన గ్రామస్తులు మంచి వ్యక్తిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా చేసుకుంటే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారు. అంతా కలిసి ఏకగ్రీవ సర్పంచులను ఎన్నుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పాటు అదనంగా ప్రభుత్వం రూ.10లక్షలు అందజేస్తుంది. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకం, దీనికి అదనంగా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు ఇస్తామని వెల్లడించారు.
రూ.25 కోట్లు ఇవ్వనట్టే
ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన 135 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామ పంచాయతీకి ప్రభుత్వం రూ. 10లక్షలు, మరో రూ.5 లక్షలు స్థానిక ఎమ్మెల్యేల నిధుల నుంచి ఇస్తామని ఎన్నికల ముందు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలా జిల్లాకు రూ.25కోట్ల నిధులు రావాల్సి ఉంది. కానీ ఎన్నికలు జరిగి మూడేండ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ నిధులు రాలేదు. పైగా ఇకపై ఆ నిధులపై ఆశలు పెట్టుకోవద్దని, ఇటు పంచాయతీ అధికారులు.. అటు ప్రజాప్రతినిధులు తెగేసి చెబుతుండటంతో సర్పంచ్‌లు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలకిచ్చిన మాటలు ఎట్లా నిలబెట్టుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించలేక ప్రజల్లో తిరగలేకపోతున్నామని చెబుతున్నారు. కనీసం ఎమ్మెల్యే నిధుల నుంచి ఇస్తానన్న రూ. 5 లక్షల నిధులు కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఇవ్వడం లేదని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ నిధులపై ఆశలొద్దు - శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలో 53 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకోవడం జరిగింది. ఈ పంచాయతీలకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చేది లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆ నిధులపై సర్పంచ్‌లు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు.