Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు వారణాసికి
- ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజిబిజీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్... మంగళవారం అక్కడ పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మెడికల్ చెకప్‌ల కోసం ఆయన నిజాముద్దీన్ ఈస్ట్‌కు వెళ్లినట్టు తెలిసింది. అనంతరం ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది సుహిల్ దత్‌ను కలిశారు. నదుల అనుసంధానానికి సంబంధించి గోదావరి-కావేరీని కలిపేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న సంగతి విదితమే. అయితే ఇది గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకం. అందువల్ల దీనికి సంబంధించిన న్యాయపరమైన అంశాలపై ఆయన దత్తో చర్చించినట్టు తెలిసింది. జాతీయ స్థాయి రాజకీయాలతోపాటు అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్‌లో ఒక జాతీయ సదస్సు నిర్వహించేందుకు కేసీఆర్ గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆయన ఢిల్లీలో పలువురు విశ్రాంత ఐఏఎస్‌లను కూడా కలిసి, మంతనాలు జరిపారు. మరోవైపు సీఎం బుధవారం ఢిల్లీ నుంచి వారణాసి బయల్దేరి వెళ్లనున్నారు. దైవదర్శనం కోసమే ఆయన అక్కడకు వెళుతున్నారంటూ టీఆర్ఎస్ వర్గాలు చెబుతుండగా... ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకే సీఎం వారణాసికి పోతున్నారంటూ మీడియాలో చర్చ కొనసాగుతున్నది. అయితే సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విషయాలను బయటకు పొక్కకుండా టీఆర్ఎస్ వర్గాలు జాగ్రత్త తీసుకుంటుండటం గమనార్హం.