Authorization
Sat March 22, 2025 05:58:51 am
- మేయర్, ఆర్టీసీ చైర్మెన్ గ్రూపుల బాహాబాహీ
- బాజిరెడ్డి అల్లుడి కారుపై దాడి..మేయర్ భర్తపై కేసు
నవతెలంగాణ-కంఠేశ్వర్
టీఆర్ఎస్ పార్టీలో భూ రగడ చోటుచేసుకుంది. ఓ స్థలం విషయమై నిజామాబాద్ నగర మేయర్ అనుచరులతో పాటు, రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్ అల్లుడి అనుచరులు బాహాబాహీకి దిగారు. వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ ప్రాంతంలో నివాస స్థలం తమదంటూ బాజిరెడ్డి గోవర్ధన్ అల్లుడు సంపత్ తన అనుచరులతో వెళ్లగా.. విషయం తెలుసుకున్న నగర మేయర్ దండు నీతుకిరణ్ భర్త శేఖర్ రంగంలోకి దిగారు. దీంతో బుధవారం ఇరు గ్రూపుల మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. భూమికి సంబంధించిన పేపర్లు తీసుకురావాలని సూచించడంతో దీంతో ఇరువురూ వెళ్లిపోయారు. సాయంత్రం మళ్లీ బాజిరెడ్డి అల్లుడు సంపత్ తన అనుచరులతో స్థలంలోకి వెళ్లగా.. స్థానికులు అడ్డుకున్నారు. మేయర్ సైతం రావడంతో ఇరు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది. దీంతో మళ్లీ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నచ్చజెప్పి పంపించారు. సంపత్ కారుపై పలువురు రాళ్లు విసిరారు. ఘటనపై సంపత్ ఫిర్యాదు మేరకు మేయర్ భర్త దండు శేఖర్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టు ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు.