Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక శాఖలన్నీ వారి వద్దే
- సోమేశ్‌కుమార్‌కు సీఎస్‌గా అర్హత లేదు
- తెలంగాణ ప్రజానీకం ఆలోచించాలి :
రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమ ఆస్తులు, అంతస్తు లు పెంచుకునేందుకు బీలుగా బీహార్‌కు చెందిన ఐఏఎస్ ముఠా రక్షణ వలయంగా పని చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కీలక శాఖలన్నీ సీఎం వారికే అప్పగించారని చెప్పారు. వారు అన్ని విధాలుగా కేసీఆర్‌కు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు.ఇప్పుడు బీహారు ఐఏఎస్‌ల కబంధ హస్తాల్లో ఉందన్నారు. దీనిపై తెలంగాణ సమాజం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ 2008లో ఒక టీవీ ఇంటర్వ్యూలో తమ పూర్వీకులు బీహార్ నుంచి వచ్చారని చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ పౌరులకు పరిపాలనలో అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ అంజనీ కుమార్‌తో బీహార్ ఐఏఎస్‌లకు ఒక్కొక్కరికి ఆరు శాఖలు అప్పగించారని చెప్పారు. వారిని రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకుని పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంత అధికారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రాంతానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో ప్రతిభావంతులు లేరా? అని ప్రశ్నించారు. తాను చేసిన చేసిన విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సింది పోయి...మళ్లీ బీహార్ వ్యక్తులు రంగంలోకి దిగారని తెలిపారు. ఆ రాష్ట్ర మంత్రి సంజరుకుమార్ ఝా...సీఎం కేసీఆర్‌ను సమర్థిస్తూ తనపై విమర్శలు చేశారని తెలిపారు. కేసీఆర్ మూలాలు బీహార్‌లో ఉన్నట్టు ఈ ఘటనతో తేలిపోయిందన్నారు. ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శమని కేసీఆర్ పదే పదే చెబుతూ వచ్చారనీ, దానికి కారణంగా భూతగాదాలతో హత్యలు జరుగుతున్నాయన్నారు. ధరణి లోపాల వల్లే రెండు హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పూర్వీకులు బీహార్ కావొచ్చు.. కానీ పరిపాలన మొత్తం బీహార్ బ్యాచ్‌కే అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. సోమేశ్‌కుమార్ సీనియార్టీ ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీకే పరిమితమన్నారు. కానీ సీఎస్‌గా బాధ్యతలిచ్చారని ఆరోపించారు. రజత్‌కుమార్ జనరల్ ఎన్నికల్లో అవకతవకలకు సహకరించినందుకు భారీనీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చారని చెప్పారు. అర్వింద్‌కుమార్ చేస్తున్న అక్రమాలు అన్నీ, ఇన్నీ కావన్నారు. ఐపీఎస్ అంజనీకుమార్ కూడా బీహార్ బ్యాచ్ అనీ, డీజీపీ మహేందర్‌రెడ్డిని ఉన్న ఫళంగా పంపించి అదే రాష్టానికి చెందిన అంజనీకుమార్‌ను తీసుకొచ్చారని చెప్పారు. ఈరకంగా రాష్ట్రం మొత్తం బీహారీల చేతిలో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.