Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతు ధర అమలు చేయకపోవడంతో రైతులకు నష్టం
- రుణ విమోచన చట్టం కోసం ఉద్యమం
- 5, 6 తేదీల్లో రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరించిన నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా వ్యవసాయరంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నదని తెలంగాణ రైతు సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మార్కెట్లలో వివిధ పంటలకు మద్దతు ధర అమలు చేయకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణ విమోచన చట్టం సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈనెల 5,6 తేదీల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, అరిబండి ప్రసాద్‌రావు, మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకష్ణ ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వివిధ కల్తీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనీ, వాటిని ఆరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని విమర్శించారు. రాష్ట్రానికి అవసరమైన ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, నూనెగింజలు పండించుకునే రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరముందన్నా రు. ప్రభుత్వానికి విధానం లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. పాడి రైతులకు సరైన ప్రోత్సహం ఇచ్చి, ఆదుకోవాలని కోరారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టాలను సాధించాల్సి ఉన్నదన్నారు. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతున్నదన్నారు. గతేడాది ప్రకృతివైపరీత్యాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వడగండ్ల వర్షం వల్ల రూ.2,500 కోట్ల విలువైన పంటలు నష్టపోయాయన్నారు. తామర తెగులు సోకి మిరప పంట, గులాబీపురుగు తొలిచి పత్తి పంట దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి నష్టాన్ని కూడా ప్రకతి వైపరీత్యంగానే పరిగణిం చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వ్యవసాయ రంగ సమస్యలపై చర్చించేందుకు జరగనున్న రాష్ట్ర సదస్సులో వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఏఐకేఎస్ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని వెల్లడించారు.