Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గానికి పంపాలని నిర్ణయించింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీషు మీడియం బోధనకు చేపట్టాల్సిన విధివిధానాలు, ప్రయివేటు విద్యాసంస్థల్లో పీజుల నియంత్రణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో సమావేశమైంది. మంత్రులు కే తారకరామారావు, టీ హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్ పాల్గొన్నారు.
తమ సిఫారసును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించి, త్వరలో విధివిధానాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. దీనికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంగ్లీష్‌మీడియంలో చేరే విద్యార్థులకు బైలింగ్వల్ విధానంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ముద్రించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. విద్యార్థులకు మెలకువలు నేర్పేందుకు టీ-శాట్ ద్వారా ప్రత్యేక కోర్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీషు మీడియం ఏర్పాటును తల్లిదండ్రుల ఆకాంక్షగా భావిస్తున్నట్టు మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, అధికారులు క్రిస్టీనా చోంగ్తు, దివ్య, ఉమర్ జలీల్, దేవసేన తదితరులు పాల్గొన్నారు.