Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నూతన రైల్వే లైన్లపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెన్నై నుంచి న్యూఢిల్లీ మార్గంలో రద్దీని అధిగమించేందుకు రైల్వేశాఖ మూడో లైన్ నిర్మాణం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొండపల్లి నుంచి కాజీపేట వరకు రైల్వే అధికారులు మూడో లైన్ పనులు ముమ్మరం చేశారు. రైల్వేస్టేషన్ల సమీపాన లూప్లైన్ల నిర్మాణం చేపట్టాల్సి రావడంతో ఎక్కువ స్థలం అవసరం అవుతోంది. ఈ మార్గంలో అతిపెద్ద రైల్వేస్టేషన్లుగా ఉన్న మధిర, ఖమ్మం రైల్వేస్టేషన్ సమీపాన ఎక్కువ భూములు సేకరించేందుకు మార్కింగ్ చేస్తున్నారు. దీంతో వేలాది మంది నిరాశ్రయులుగా మారనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామా నుజవరంలోనూ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) రైల్వేలైన్ కోసం కూడా భూసేకరణ చేస్తుండటంతో ఆ గ్రామంలోనూ సోమవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. రెవెన్యూ అధికారులు లేకుండా భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన పోలీసులు, జెన్కో అధికారులపై స్థానికులు తిరగబడ్డారు. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైల్వేలైన్లతో వేలాది మంది నిరాశ్రయులుగా మారుతున్నారు.
మూడులైన్కు మూడుసార్లు సర్వే.. హద్దులు
కొండపల్లి- కాజీపేట మూడోలైన్ కోసం ఇప్పటికే మూడుసార్లు సర్వే నిర్వహించి, హద్దులు ఏర్పాటు చేశారు. రెండేండ్ల కిందట మధిర, ఖమ్మంలో రైల్వే అధికారులు సర్వే నిర్వహించారు. సెంటర్ ట్రాక్ నుంచి 20 మీటర్ల వరకు హద్దు ఏర్పాటు చేశారు. రెండు నెలల కిందట సర్వే చేసి 32 మీటర్ల వరకూ తమ శాఖదేనని మార్కింగ్ పెట్టారు. 15 రోజుల కిందట సర్వే చేసి 2008 లెక్కల ప్రకారం ఏకంగా 97 మీటర్ల వరకు స్థలం రైల్వేశాఖదేనని రాద్ధాంతం చేస్తున్నారు. ఇలా పొంతనలేని రైల్వేశాఖ సర్వేలతో ఖమ్మం, మధిరలోనే కాకుండా ఈ మార్గంలో ఉన్న ప్రతి స్టేషన్ వద్ద ఇదే పరిస్థితి ఉండటంతో వేలాది మంది నిరాశ్రయులుగా మారుతున్నారు. పైగా రైల్వేట్రాక్ వెంట ఇండ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలే. 'ఓవైపు బిడ్డ పెళ్లీడుకొచ్చింది. మరోవైపు గూడు చెదురుతోంది..' అని ఆవేదనతో ఖమ్మం నగరంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఓ నిరుపేద కూలీ రైలుపట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు యత్నించాడు. సమీపంలోని వారు సకాలంలో చూడటంతో ప్రాణంతో బయటపడ్డాడు. సారథీనగర్ రైల్వేట్రాక్ వెంట ఉన్న అంబేద్కర్ నగర్లో దాదాపు 300 కుటుంబాలు 20 ఏండ్లకు పైబడి నివసిస్తున్నాయి. ఇక్కడి పురుషులు ఆటో, రిక్షా కార్మికులు, హమాలీలు, రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. మహిళలు సమీపంలోని మామి ళ్లగూడెంలో ఇండ్లఓ్ల పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరికి 2004, 2009లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చింది. రైల్వే అధికారుల పొంతనలేని సర్వేలతో ఇప్పుడు ఈ ఇండ్లను మూడో లైన్ మింగేస్తోంది. దీనిపై ఖమ్మం అర్బన్ తహసీల్దార్ మిట్టపల్లి శైలజ, స్థానిక కార్పొరేటర్ తోటరామారావును అంబేద్కర్‌నగర్ వాసులు కలిసి మొరపెట్టుకున్నారు. పట్టాదారులందరికీ ప్రత్యామ్నాయ స్థలం చూపుతామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
మధిరలోనూ ఇదే దుస్థితి
మధిరలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ప్రస్తుతం నిర్మించే అప్‌లైన్ వైపు ఉన్న లడకబజారు ప్రాంతంలోనూ ఎక్కువ మంది పేదలే నివసిస్తున్నారు. రిక్షా తొక్కి, మూటలు మోసి, కూలికి వెళ్లగా వచ్చిన డబ్బులతో పొట్టపోసుకుంటున్నారు. రైల్వే అధికారుల వైఖరితో ఇప్పుడు వీరంతా నిరాశ్రయులుగా మారుతున్నారు. బ్రిటిష్ కాలంలో ఒక్కటే ట్రాక్ ఉండగా 1965 ఏప్రిల్‌లో రైల్వేశాఖ కొంత భూమి కొనుగోలు చేసింది. 1968లో రైల్వేట్రాక్ నిర్మించింది. అప్పటి హద్దులు నేటికీ ఉన్నా వాటిని కాదని 2008లో ఓ ప్రయివేట్ సంస్థ చేసిన సర్వే ఆధారంగా మార్కింగ్ చేయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైల్వే అధికారుల లెక్కల ప్రకారం 29 గుంటల భూమి ఉండాలి. కానీ ప్రస్తుతం మార్కింగ్ చేసిన ప్రకారం మూడెకరాల వరకు ట్రాక్ వెంట భూ విస్తీర్ణం వస్తోంది. కొలతల్లో తప్పు ఉందని రైల్వే అధికారులు గుర్తించినట్టు తహసీల్దార్ రాజేష్ తెలిపారు. దీనిపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపించామన్నారు.
బీటీపీఎస్ రైల్వేలైన్‌తోనూ ఆందోళన
కొత్తగూడెం జిల్లా బీటీపీఎస్ రైల్వేలైన్ విషయంలోనూ ఆందోళన కొనసాగుతోంది. మణుగూరు మండలం రామానుజవరంలో సోమవారం పోలీసులు, జెన్కో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. పరిహారం ఇవ్వకుండా భూములు బలవంతంగా లాక్కుం టున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. కేతినేని రాజేష్ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పంట చేలను ధ్వంసం చేయకుండా అడ్డుకున్న రైతులు, అడ్డువచ్చిన మహిళలపై పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారు. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారు. పరిహారం ఇచ్చే వరకు పనులు సాగనివ్వబోమని రైతులంటున్నారు.
మా బతుకులు ఆగం చేయొద్దు
రోజు కూలి పనులు చేసుకొని పొట్ట పోసుకునేటోళ్లం. పాతి కేండ్లకు పైబడి అంబేద్కర్‌నగర్‌లో ఉంటున్నాం. రైల్వేగోడ వెలుపల ఉంటున్నా మేము ఉండే జాగ రైల్వేవోళ్లదే అంటున్నారు. ఇక్కడే కూటికి, గుడ్డకు ఏడ్చినం. ఒక్క పూట తింటే.. మరోపూట పస్తులుండి కుటుంబాలను పోషించుకుంటున్నాం. ప్రభుత్వం ఇండ్ల పట్టాలిచ్చినప్పటి నుంచి ధైర్యంగా ఉంటున్నాం. ఒక్కసారిగా ఊడిపడిన రైల్వేవోళ్లు ఈ స్థలం మాదంటూ గుర్తులు పెట్టి పోయిండ్రు. అయ్యాల్టి నుంచి మేము మనుషులం కావట్లేదు. తినే కూడు సహించట్లేదు. పట్టాలవతల మామిళ్లగూడెంలో పనులు చేసి బతుకుతున్నం. ఇక్కడి నుంచి మమ్మల్ని వేరేకాడికి పంపితే మేము ఎట్టా బతకాలి? మా బతుకులు ఆగం చేయొద్దు. మంత్రి గారే న్యాయం చేయాలి సారూ.
-కౌరోజు సైదమ్మ మూడోలైన్ బాధితురాలు- ఖమ్మం