Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారల్‌మార్క్స్ పుస్తకాలతోనే మూడోవంతు దేశాల్లో విప్లవం
- ప్రజల జ్ఞాన సముపార్జనకు పుస్తకాలే దోహదం : బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
- కరీంనగర్ పుస్తక ప్రదర్శన ప్రారంభం
- 50స్టాళ్లలో సుమారు 20వేల పుస్తకాలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'కమ్యూనిస్టు మ్యానిఫెస్టోనే ప్రపంచాన్ని చైతన్యం చేసింది. కారల్‌మార్క్స్ రాసిన పుస్తకాలే మొత్తం భూభాగంలోని మూడోవంతు దేశాల్లో జెండాలు పాతి విప్లవాన్ని తీసుకొచ్చేలా చేశాయి. ప్రజలను ప్రభావితం చేసే అటువంటి శక్తి పుస్తకాలకు మాత్రమే ఉంటుంది' అని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజల జ్ఞాన సముపార్జనకు పుస్తకాలే దోహదం చేస్తాయని, గొప్పగొప్ప వాళ్లు అందించిన సాహిత్యం, ఇతర రచనలే భవిష్యత్ తరాలకు దిక్సూచిగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే మైదానంలో వారం రోజులపాటు సాగే పుస్తక ప్రదర్శనను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ప్రముఖ కవి, రచియిత సినారే, అలిశెట్టి ప్రభాకర్ మొదలుకుని 14భాషల్లో సాహిత్యాన్ని ఆయా భాషాల్లోకి తర్జుమా చేసిన నలిమెల భాస్కర్, సంస్కత పండితుడిగా పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి వరకు ఈ జిల్లాకు చెందిన వాస్తవ్యులు కావడం గర్వకారణమని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పుస్తక ప్రియుడని, ఆయన ఎన్నోవేల పుస్తకాలు చదివి అంత జ్ఞానాన్ని సమకూర్చుకున్నారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రాధాన్యత, ఈ ప్రాంతం ఎలా అన్యాయానికి గురవుతుందో ప్రస్తావిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ రాసిన పుస్తకాలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయన్నారు. పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే పుస్తకాలను పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు. పుస్తక ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సందర్శించి 50 స్టాళ్లలో ఏర్పాటు చేసిన 20 వేల పుస్తకాల్లో నచ్చిన పుస్తకం కొనుగోలు చేయాలని సూచించారు.
పుస్తకాలతోనే ఇంట్లో వెలుగులు
పుస్తకాలతోనే ఇంటికి వెలుగులు వస్తాయని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. పిల్లలకు పుస్తకాలు కొనిచ్చి చదవడం అలవాటు చేయాలని సూచించారు. దీనివల్ల పిల్లలు విజ్ఞానం పెంపొందించుకుంటారన్నారు. చదువుతోనే మహిళల్లో చైతన్యం పెరుగుతుందన్న విషయాలను పలు ఉదాహరణలతో వివరించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి.కర్ణన్ పుస్తకప్రియుడని, ఆయన ప్రోత్సాహం వల్లే ఇక్కడ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఈనెల 4వ తేదీన సాహిత్య అకాడమీ పక్షాన అన్ని పాఠశాలల్లో 'మన ఊరు -మన చెట్లు' అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
కలెక్టర్ ఆర్వి.కర్ణన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో భాగంగా మహిళల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి జరిగే మహిళల కార్యక్రమానికి మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన స్వాగత నృత్యం అలరించింది. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం 'అమ్మా నాన్న ప్రేమ'పై రాసిన పాట ఆకట్టుకుంది.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మెన్ జీవి రామకృష్ణరావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, డీఆర్డీవో శ్రీలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా, జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రావు, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, కార్పొరేటర్లు, సాహితీవేత్తలు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.