Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధాన నిర్ణయాల అమల్లోనూ వివక్ష
- సీఐఐ నాయకత్వ సదస్సులో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో పారిశ్రామికాభివృద్ధిని సాధించడంలోకేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రాష్ట్ర పరిశ్రమలు,ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. విధాన నిర్ణయాల అమల్లోనూ కేంద్రప్రభుత్వం రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నదని విమర్శించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ) తెలంగాణ రాష్ట్ర శాఖ వార్షిక సమావేశం, నాయకత్వ సదస్సు బుధవారంనాడిక్కడి ఓ హౌటల్లో జరిగింది. ఆ సమావేశాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఆశించిన అభివృద్ధి జరగలేదని అభిప్రాయపడ్డారు. కార్లలో వాడే సాంకేతిక చిప్స్ కొరతతో అమ్మకాలు నిలిచిపోయాయి అంటే....మనం ఏ సాధించామనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుందన్నారు. తైవాన్, సింగపూర్ వంటి అతి చిన్న దేశాలు సాంకేతికతను అందిపుచ్చుకొని అభివృద్ధిని సాధించాయనీ, అన్ని వనరులూ ఉన్న భారతదేశం ఆ దిశగా ఎందుకు వెళ్లలేకపోతున్నదని ప్రశ్నించారు. దేశాన్ని, ప్రజల్ని రాజకీయంగా వాడుకోవడాన్ని పార్టీలు వదిలేసి, దేశ ఆర్థిక వృద్ధిపై చిత్తశుద్ధి చూపిస్తే అభివృద్ధి సాధించడం పెద్ద కష్టమేం కాదన్నారు. దానికి తెలంగాణ రాష్ట్రమే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. బెంగుళూరు-హైదరాబాద్ రహదారిలో కేంద్ర రక్షణ శాఖ ప్రభుత్వ కార్యాలయాలు, కర్మాగారాలు అనేకం ఉన్నాయని, వాటిని అనుసంధానించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను అడిగితే, ఆ పని బుందేల్‌ఖండ్‌లో చేస్తామని చెప్పారని అన్నారు. తాము అడిగిన దానికీ, మంత్రి సమాధానానికి సంబంధమే లేదనీ, ఇలాంటి వివక్ష పూరిత నిర్ణయాలు సరికాదన్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో రూపొందించిన ఆత్మనిర్భర్ భారత్‌లో కేటాయింపులు రాష్ట్రానికి తీవ్ర నిరాశను మిగిల్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా అని ప్రశ్నించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలు తక్కువగా, స్వదేశంలో ఉత్పత్తి చేస్తే ధర ఎక్కువగా ఎలా ఉంటాయనీ, ఇదెక్కడి ఆత్మనిర్భర భారత్ అని విమర్శ చేశారు. పారిశ్రామికాభివృద్ధి మందగింజడంతో దేశంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని గణాంకాలతో వివరించారు. కేంద్రప్రభుత్వం చైనాతో పారిశ్రామికంగా పోటీ పడాలే తప్ప, రాజకీయంగా కాదని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో చైనా అన్నిరంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తున్నదనీ, ఆ తరహా విధాన నిర్ణయాలు దేశంలో అమల్లోకి రావాలన్నారు. కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ శాఖ చైర్మెన్ సమీర్ గోయల్ స్వాగతోపన్యాసం చేశారు. పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, భారత్ బయోటెక్ సీఎమ్‌డీ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ దీపక్ బగ్లా తదితరులు పాల్గొన్నారు. సీఐఐ తెలంగాణ శాఖ వైస్ చైర్మెన్ వాగిష్దీక్షిత్ వందన సమర్పణ చేశారు. అంతకుముందు వివిధ విభాగాల్లో ఆర్ధిక వృద్ధి, సామాజిక కార్యక్రమల్లో పాల్గొన్న పలు కంపెనీల ప్రతినిధులను మంత్రి శాలువా కప్పి, అవార్డులు అందించారు.