Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేను మెడికల్ లీవ్‌పై వెళ్లాను : డీజీపీ మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి:తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులపై పంపించినట్టు పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలో నిజం లేదని మెడికల్ లీవ్‌పై ఉన్న డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఖండించారు. దీనికి సంబంధించి ఆయన గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇంట్లో కింద పడటం వలన తన ఎడమ భుజానికి ఫ్రాక్షరైందనీ, దాంతో తాను డాక్టర్ల సలహా మేరకు చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నాని ఆయన తెలిపారు. మరోవైపు, ఆ గాయానికి ఫిజియోథెరపీతో పాటు మందులు వాడుతున్నానని వివరించారు. డాక్టర్ల సలహా మేరకు గతనెల 18వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు మెడికల్ లీవ్ కూడా పెట్టడం జరిగిందన్నారు. వాస్తవాలు గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ తన రాజకీయ అవసరాల కోసం ఇలాంటి అవాస్తవ ప్రకటనను రేవంత్‌రెడ్డి చేయడం సహేతుకం కాదని అన్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల తాను తీవ్రమైన అభ్యంతరాలను తెలియజేస్తున్నానని తెలిపారు.
ఐపీఎస్ సంఘం ఖండన
రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని బలవంతంగా సెలవులపై పంపినట్టు కొందరు రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యానించడంలో నిజం లేదని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం గురువారం ఒక ప్రకటనలో ఖండించింది. భుజానికి గాయమైన నేపథ్యంలో మహేందర్ రెడ్డి మెడికల్ లీవ్‌లో ఉన్నారని తెలిపింది. అంతేగాక, మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌తో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌ల పైన ఇష్టమచ్చినట్టు వ్యాఖ్యానాలు చేయడం సరికాదని సంఘం అభ్యంతరం తెలిపింది.