Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర స్కీం వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర స్కీం వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కన్వీనర్ పి. ప్రేమ్ పావని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జాతీయ డిమాండ్స్ డే జరపాలని అఖిల భారత స్కీం వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్లోని సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్ పావని మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, పోషకాహారం మొదలైన రంగాల్లో కీలక సేవలను స్కీం వర్కర్లు అందిస్తున్నారని చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలేననీ, వారు అణగారిన వర్గాల సంక్షేమానికి చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. బండెడు చాకిరి చేస్తున్న వారికి గౌరవ వేతనం పేరుతో తక్కువ జీతాలు ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. వారికి కనీస వేతనాలు, పింఛన్లు, భవిష్య నిధి, బీమా పథకాన్ని వర్తింపచేయాలనీ, ఉద్యోగ, సామజిక భద్రత కల్పించాలని కోరారు. కేంద్ర బడ్జెట్లో సంక్షేమ పథకాల అమలుకు తగినన్ని నిధులు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో స్కీం వర్కర్లందరూ కలిసికట్టుగా తమ హక్కులకోసం ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్. బోస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న స్కీం వర్కర్లను ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించరని ప్రశ్నించారు. స్కీం వర్కర్ల జీవనోపాధికి భంగం కల్పించేవిదంగా కేంద్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు కేటాయించే నిధుల్లో భారీ కోతలు విధిస్తుందని అయన తెలిపారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శులు ఎం. నరసింహ, బి. వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర స్కీం వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నేతలు ఎస్. ఛాయాదేవి, జ్యోతి శ్రీమాన్ మర్రి తోపాటు అంగన్ వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం పథకం కార్యకర్తలు పాల్గొన్నారు.