Authorization
Sat March 22, 2025 09:00:30 am
నవతెలంగాణ - మల్లాపూర్
పసుపు పంటకు మద్దతు ధర, చక్కెర కర్మాగారాన్ని పున్ణప్రారంభించే వరకు రైతుల పోరాటం ఆగదని చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట చక్కెర కర్మాగారం నుంచి రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్ గంజి వరకు సాగనున్న మహా పాదయాత్రను గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నాయన్నారు. చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తామని, పసుపు పంటకు కనీస మద్దతు ధర రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చి నాయకులు మాట మార్చారన్నారు. వెంటనే చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించి.. పసుపు పంటను మద్దతు ధర జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఆరుతడి పంటలు మినుము, పెసరు కొనుగోలు ఇప్పటివరకు చేయలేదని తెలిపారు. ఏకకాలంలో రుణమాఫీి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వెంటనే ఆదుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బద్దం శ్రీనివాసరెడ్డి, వాకిటి సత్యం రెడ్డి, గురిజాల రాజారెడ్డి, అల్లూరి మహేందర్ పాల్గొన్నారు.