Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ వాదన సరికాదు
- కార్మికుల పోరాటాన్ని ప్రజలు సమర్థిస్తారు :టీఎస్ఆర్టీసీ జేఏసీ దీక్షలో మాజీ ఎమ్మెల్సీ
ప్రొఫెసర్ కే నాగేశ్వర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రెండు దశాబ్దాలుగా ఆర్టీసీని విచ్ఛిన్నంచేయాలని ప్రభుత్వాలు ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా, ఆ సంస్థను పరిరక్షించుకుంటున్నది కార్మిక సంఘాలేనని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ స్పష్టంచేశారు. టీఎస్ఆర్టీసీ ఏర్పాటు తర్వాత అత్యధికంగా నష్టపోయింది ఆర్టీసీ కార్మికులేననీ, వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వ వాదన సరికాదని తేల్చిచెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ఆర్టీసీలను నిర్వీర్యం చేస్తున్నాయనీ, కేంద్రప్రభుత్వం ఏకంగా చట్టాలనే మార్చేసిందని విమర్శించారు. ఆర్టీసీలు ప్రజల ఆర్థికాభివృద్ధికి దిక్సూచులనీ, వాటిని లాభనష్టాల దృష్టితో పాలకులు చూడకూడదని చెప్పారు. విద్యాశాఖ, ఉస్మానియా, గాంధీ అస్పత్రుల నుంచి లాభాలను ప్రభుత్వాలు ఆశించవనీ, వాటిని సామాజిక బాధ్యతగా నిర్వర్తియనీ, ఆర్టీసీ కూడా అదే కోవకు చెందినదని అన్నారు. తొమ్మిది యూనియన్లతో కూడిన టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఒక్కరోజు నిరాహారదీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి (ఎంప్లాయీస్ యూనియన్), వైస్‌చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్ (టీజేఎమ్‌యూ), కన్వీనర్లు వీఎస్ రావు (ఎస్‌డబ్ల్యూఎఫ్), పి కమాల్‌రెడ్డి (ఎన్‌ఎమ్‌యూ), కో కన్వీనర్లు జీ అబ్రహం (ఎస్‌డబ్ల్యూయూ), కే యాదయ్య (బీకేయూ), బీ సురేష్ (బీడబ్ల్యూయూ), బీ యాదగిరి (కార్మిక పరిషత్)తో పాటు పలువురు ఉద్యోగులు నిరాహారదీక్షలో పాల్గొన్నారు. వారందరికీ పూలమాలలువేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ దీక్షా శిబిరంలో కూర్చొబెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణమని ప్రభుత్వం భావిస్తే, ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు రెండు ఫిట్మెంట్లు, ఆరు డిఏలు సహా అనేక ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం, యాజమాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. సంస్థ నష్టాలకు ప్రభుత్వం, యాజమాన్యం తీసుకొనే నిర్ణయాలు కారణమని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తికాగానే మార్చి 10వ తేదీ నుంచి మళ్లీ కేంద్రం డీజిల్, పెట్రోల్ చార్జీలు భారీగా పెంచుతుందనీ, ఆ భారాలకు కార్మికులు ఎలా బాధ్యులు అవుతారని ప్రశ్నించారు. అమెరికా వంటి పూర్తి పెట్టుబడిదారీ వ్యవస్థలు కూడా అక్కడి ప్రజారవాణాపై పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నాయనీ, ఇక్కడ రాష్ట్ర బడ్జెట్లో కనీసం 2 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. యూనియన్లు ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేవనీ, అది రాజ్యాంగ కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో యూనియన్లు వర్థిల్లాలని నినాదాలు చేసిన ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు వద్దంటూ ఎలా చెప్తారని ఎద్దేవా చేశారు. రెండేండ్ల క్రితం 56 డిమాండ్లతో 55 రోజులు సమ్మె చేస్తే, వాటిలో కార్గో సర్వీసు ప్రారంభం, సమ్మెకాలపు వేతనం ఇవ్వడం తప్ప, ఇతర ఏ డిమాండ్లు పరిష్కరించారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం తక్షణం పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీలో డ్యూటీలు చేస్తున్న కార్మికులు మొదలు విధుల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు సహా ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. తాము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.