Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యసేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానం
- బీజేపీ ఎంపీలకు దమ్ముంటే సీసీఐని తెరిపించాలి :మంత్రి హరీశ్‌రావు
- ఆదిలాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో అమలవుతున్న అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర మంత్రులు మెచ్చుకుంటే.. ఆ పార్టీకి చెందిన నాయకులు మాత్రం గల్లీలో లొల్లిపెడుతున్నారని ఆర్థిక, వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారని గుర్తుచేశారు. ఈ విషయంలో సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం చిట్టచివర 28వ స్థానంలో ఉందన్నారు.
గురువారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించిన మంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాసరలో అమ్మవారిని దర్శించుకొని శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముధోల్‌లో 30పడకల ఆస్పత్రి, నిర్మల్‌లో 250పడకల ఆస్పత్రి, రేడియాలజీ ల్యాబ్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదిలాబాద్‌లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభంతో పాటు రూ.75లక్షలతో నిర్మించనున్న రేడియాలజీ ల్యాబ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. కరోనా కాలంలో ఇంటింటి సర్వే నిర్వహించి మందుల కిట్లు పంపిణీ చేశామని.. ఇలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని నిటిఆయోగ్ సూచించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే బీజేపీకి చెందిన ఇద్దరు.. ముగ్గురు వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ(సీసీఐ)ని తెరిపించాలన్నారు. ఇక్కడి ప్రజలపై ప్రేముంటే ఢిల్లీలో కూర్చొని సీసీఐని తెరిపించేందుకు కృషి చేయాలని సూచించారు. అఖిలపక్షం దీక్షలు కూడా చేపట్టిందని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలకు ఇలాంటి వాటిని తీసుకురావడం చేతకాదు కానీ..అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ, సీసీఐ పున:ప్రారంభం వంటి కోసం కృషిచేయాలి కానీ అడ్డుకుంటే ప్రజలు సహించరని హెచ్చరించారు. తెలంగాణలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని.. ఇది చూసి మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ సరిహద్దుల్లో భూములు కొనుగోలు చేసి ఇక్కడ్నుంచి నీళ్లు తీసుకెళ్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే హైకమాండ్ అని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలే పార్టీకి గీటురాయిగా అభివర్ణించారు. కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనీయబోమని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీ చైర్మెన్లు రాఠోడ్ జనార్ధన్, విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, విఠల్‌రెడ్డి, రేఖానాయక్, డీఎంఈ రమేష్‌రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తాపట్నాయక్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్‌రాథోడ్ పాల్గొన్నారు.