Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఓయూ
పచ్చని చెట్లు సకల ప్రాణికోటికి ప్రాణ బిక్ష.. చెట్లను సంరక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు పెద్దఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటుతోంది. హెచ్ఎండీఏ ఎండీ అర్వింద్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీలో వందలాది మొక్కలు నాటించి, సంరక్షణ కోసం ఫెన్సింగ్ వేయించారు. కానీ ప్రస్తుతం అక్కడ తీరుమారింది. రకరకాల సాకుతో ఇక్కడి పచ్చని చెట్లను పర్యావరణ విభాగం, ఫారెస్టు విభాగాల అనుమతి లేకుండానే నరికేస్తున్నారు. ఓయూలో కొత్తగా ప్రారంభించిన సెంటినరి హాస్టల్‌కు విద్యుత్ సరఫరా కోసం కరెంట్ పోల్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో లా కాలేజ్ నుంచి డి హాస్టల్ వరకు, జాగ్రఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఐపీఈ మీదుగా మెయిన్‌రోడ్డు వెంట ఇరువైపులా చెట్లను నరికేశారు. వాస్తవానికి ఇక్కడి చెట్లను తప్పనిసరి పరిస్థితిలో నరకాలన్నా, కొమ్మలు కట్ చేయాలన్నా ఫారెస్ట్ విభాగం అధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ ఓయూ బిల్డింగ్ డివిజన్ పరిధిలో విద్యుత్ విభాగం, అధికారులు తమ ఇష్టానుసారం చెట్లను నరికేస్తున్నారు. న్యూ పీజీ బిల్డింగ్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో మూడు నెమలినార చెట్లను నేలమట్టం చేశారు. ఒక వైపు ఓయూలో 'గ్రీన్ పార్క్' ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ ఉన్న చెట్లను నరికేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సైన్సు అండ్ హ్యూమనిటీస్ బిల్డింగ్ వెనుక 45 వరకు చిన్నా చితక మొక్కలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గాలి వానకు లేదా లేదా ఎండిపోవడం వల్ల కింద పడిపోయిన చెట్లను, 15 సెంటీుటర్ల కన్నా ఎక్కువ మందం ఉన్న ప్రతి చెట్టును, సర్కార్ తుమ్మచెట్లను కొట్టేయాలన్నా యూనివర్సిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సజీవంగా ఉన్న చెట్లను, వాటి కొమ్మలను నరకడానికి ఫారెస్ట్ డిపార్టుమెంట్ లేదా ఓయూ గ్రీన్ బెల్ట్ డిపార్టుమెంట్ అనుమతులు అవసరం. కానీ ఓయూలో ఈ నిబంధనలు పాటించడం లేదు. మరోవైపు నరికేసిన చెట్ల కొమ్మలు, దుంగలను అన్నీ ఒకచోట చేర్చి టెండర్ల ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. కానీ ఓయూలో ఇద్దరు అధికారుల సపోర్ట్‌తో కొందరు వాటిని ఓయూ హాస్టల్స్ వద్దకు తరలించి బిల్లులు క్లెయిమ్స్ చేసుకుంటున్నారని తెలిసింది.
ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు
ఓయూ గ్రీన్ బెల్ట్ నుంచి అక్కడి చెట్లను నరకడానికి, మొక్కలు తొలగించడానికి మా వద్ద ఎవరూ ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు. మేము ఇవ్వలేదు.
- డా. ఎం.వెంకట రమణ, ఓయూ గ్రీన్ బెల్ట్ ఇన్చార్జి డైరెక్టర్
ఓయూ అధికారుల తీరు సరికాదు
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ జె.సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటారు. ఈక్రమంలో ఓయూలో చెట్లను నరకడం, కొమ్మలను తొలగించడం సరికాదు.
- తుంగబాలు-టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
మొక్కలు తగలబడ్డాయి
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో వారం రోజులుగా క్షేత్రస్థాయిలో పరిశీలించాం. సైన్స్ అండ్ హ్యుమానిటీస్ బిల్డింగ్ వెనుక హరితహారం కింద నాటిన మొక్కలు, పెరిగిన చెట్లు కలిపి సుమారు రెండు వందల వరకు కాలిపోయాయి. ఎవరు బాధ్యులు?. ఓయూలో చెట్లను నరికి దుంగలను, కొమ్మలను ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
- విజరు నాయక్, ఎస్ఎఫ్ఐ ఓయూ ఉపాధ్యక్షుడు, పర్యావరణ పరిరక్షకుడు
మా అనుమతి తీసుకోలేదు
ఓయూ అధికారులు చెట్లు నరికివేతకు సంబంధించి అనుమతి తీసుకోలేదు. వర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉందని తీసుకోలేనట్టు మా దృష్టికి వచ్చింది. ఓయూ ఎలక్ట్రికల్ ఏడీ వెంకట రమణ, ఓయూ గ్రీన్ బెల్ట్ డైరెక్టర్ వెంకట రమణను వివరణ ఇవ్వాలని కోరాం.
- కె.శ్రీనివాస్ రెడ్డి- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్- ఉప్పల్