Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
నవతెలంగాణ-ముషీరాబాద్
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపాలని, వెంటనే శాంతిని నెలకొల్పాలని డీవైఎఫ్ఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు ఎ.విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోటరమేశ్, అనగంటి వెంకటేశ్ అన్నారు. తక్షణం కాల్పుల విరమణ చేసి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. యుద్ధం వల్ల చనిపోయిన ప్రజలు, భారత విద్యార్థులకు నివాళి అర్పిస్తూ.. గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1980 చివరిలో ప్రచ్ఛన్న సంఘర్షణను మరింత తీవ్రతరం చేయడంలో అమెరికా, నాటో ప్రధాన పాత్ర పోషించాయన్నారు. తూర్పు ఐరోపాలోని తన సరిహద్దుల వద్ద నాటో దళాల ఉనికి కోసం ఏర్పడిన ముప్పు కారణంగా రష్యా తన భద్రత గురించి ఆందోళన చెందుతోందన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. యుద్ధం ఒక నేరమని, చర్చల ద్వారా మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడగలరని అన్నారు. ఈ యుద్ధానికి అమెరికా, రష్యా రెండూ కారణమని, వాటి చర్యలను వ్యతిరేకించాలని అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరుల భద్రతకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు మరణించారని, అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారందరినీ ఇండియాకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలని కోరారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు దినేష్, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావీద్, నాయకులు రమేష్, రఘు, కుమార్, అజరు, రాకేష్, నగేష్, వినరు, శ్రీనివాస్, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.