Authorization
Sat March 22, 2025 11:15:58 am
- అప్పుడే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది
- ఏఐఏడబ్ల్యుయూ రాష్ట్ర సమావేశాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా సమస్యలకు పరిష్కరించే వరకు పోరాడితేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలను తమ్మినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా పోరాటాలు నిర్వహించాల్సి న అవసరం ఉందన్నారు. ధరలు పెరుగుతున్నాయే కానీ కూలిరెట్లు పెరగడంలేదని, అందుకే కూలి రెట్లు పెరగాలనే డిమాండ్ కూలీలలో బలంగా ఉందన్నారు. గడిచిన రెండేళ్లలో సుమారు 14కోట్ల కుటుంబాలు పట్టణాలనుంచి గ్రామాలకు వచ్చేశార ని, కానీ ఉపాధి హామీకి నిధులు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి, కూలీ సమస్యలపైనే కేంద్రీకరించాలన్నారు. ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేయించి ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించా లన్నారు. రాజకీయంగా ఎవరితో ఇప్పుడు పొత్తులేదని, ఎన్నికల సమయంలోనే దాని గురించి మాట్లాడతామన్నారు. కూలీ పోరాటాలతోపాటు సామాజిక ఉద్యమాలను నిర్వహించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. బీజేపీ తప్పుడు విధానాల వల్ల మతోన్మాద చర్యలు, మూఢనమ్మకాలు పెరిగాయన్నారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు లేవని, ఉపాధి కూడ లేకుండా పోయిందన్నారు. ఏ రంగం చూసినా తీవ్ర ఇబ్బందులలో ఉందని, అందుకే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలన్నారు. బలమైన రైతాంగ ఉద్యమాల ద్వారానే రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని, అంతేగాకుండా రైతులకు క్షమాపణ చెప్పిందన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గ్రామంలోనే మొదలుపెట్టిన వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేశారని అన్నారు.
21లక్షల కుటుంబాలకు ఇంటిస్థలం లేదు :
ఆర్. వెంకట్రాములు,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21లక్షల కుటుంబాలకు కనీసం ఇంటిస్థలం లేదని వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు అన్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో దళితుల జనాభా 19శాతం ఉంటే భూమి కేవలం 9శాతం, బీసీలు 50శాతంపైగా ఉంటే భూమి మాత్రం 36శాతం, గిరిజనుల చేతిలో 13శాతం భూమి ఉందన్నారు. ఇదంతా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలేనని ఆయన అన్నారు. ఉపాధిహామీలో సుమారు కోటీ 19లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని, వారిలో ఇప్పుడు 60లక్షల మంది పనికి వస్తున్నారని అన్నారు. పనిచేసే చోట సౌకర్యాలు, పనిముట్లు లేవన్నారు. కూలీల సమస్యలు తీరాలంటే భూఅక్రమణ ఉద్యమాలు చేయాలన్నారు. అంతకుముందు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రసాద్ జెండావిష్కరణతో సమావేశాలను ప్రారంభించారు. సంఘంలో సుదీర్ఘకాలం పనిచేసి అమరులైన వారికి సంతాప సూచకంగా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జగన్ తీర్మానం ప్రవేశపెట్టగా రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, మహిళా కూలీల కన్వీనింగ్ కమిటి కన్వీనర్ బొప్పని పద్మ, వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య, ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, అవాజ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.జహంగీర్, సీిఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేషం, డీివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.