Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీయూసీ చైర్మెన్ జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేయడం దారుణమని పీయూసీ చైర్మెన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుట్రలోని పాత్రదారులు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంట్లో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. జితేందర్‌రెడ్డికి వారికి సంబంధమేంటని అడిగారు. కిడ్నాప్‌ల గురించి మాజీ మంత్రి డీకే అరుణకు ముందే ఎలా తెలుసని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను, కుట్రలను ఉపేక్షించేది లేదన్నారు. దోషులు ఎంతటివారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటన్నారు. సెక్షన్ 212 ప్రకారం నిందితులకు షెల్టర్ ఇచ్చిన వారూ దోషులేనని స్పష్టం చేశారు. డికె అరుణ, జితేందర్‌రెడ్డిపై కేసులు పెట్టాలంటూ డీజీపీ, సీపీలను కోరారు. దోషులకు బీజేపీ షెల్టర్ ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు నడవవని హెచ్చరించారు.
అసలు కుట్రదారులను శిక్షించాలి : ఉద్యోగ జేఏసీ
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర చేయడాన్ని తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఖండించింది. అసలు కుట్రదారులను శిక్షించాలని డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని టీజీవో కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుట్రదారుల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం టీఎన్జీవో అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్షురాలు వి మమత మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా శ్రీనివాస్‌గౌడ్ పాలమూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన హత్యకు కుట్ర చేయడాన్ని నిరసిస్తూ మూడురోజులపాటు నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలియజేస్తామన్నారు. ఇలాంటి కుట్రదారులను వెంటనే శిక్షించాలంటూ హోంమంత్రి, డీజీపీని కోరారు. రాజకీయంగా అభివృద్ధిలో పోటీపడాలి తప్ప ఇలాంటి దుష్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. మంత్రికి ఉద్యోగులందరూ అండగా ఉంటారని చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే హోంమంత్రి మహమూద్‌అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిని కలుస్తామన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్న కుట్రను టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబి కృష్ణయాదవ్ ఖండించారు. ఆయనపై హత్యాప్రయతాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్, ప్రధాన కార్యదర్శి పి నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు.