Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెదురు పరిశ్రమలో సమస్యలను పరిష్కరించుకుని ముందుకెళ్లాలి : నాగేంద్రనాథ్ సిన్హా
- ఎన్ఐఆర్డీపీఆర్లో వెదురు రంగంలో నూతన ఆవిష్కరణలపై సదస్సు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వెదురు సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందనీ, దానితో అనేక ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉందని జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల ఎన్ఐఆర్డీపీఆర్ ప్రాంగణంలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్(సీఐపీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో 'గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం కోసం వెదురు రంగంలో నూతన ఆవిష్కరణల వ్యాప్తి' అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహించారు. వెదురు సాగును ప్రోత్సహించడం ఎలా? ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో నూతన ఆవిష్కరణల జ్ఞానం మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానం వాడకం, తదితరాలపై చర్చించారు. ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో నాగేంద్రనాథ్ సిన్హా సదస్సునుద్దేశించి మాట్లాడారు. వెదురు తోటల పెంపకం ద్వారా, అనుబంధ పరిశ్రమల ద్వారా జీవనోపాధి పెరుగుతుందని చెప్పారు. వెదురు సాగులో ఎక్కువ పంట దిగుబడి వస్తుందనీ, అదే సందర్భంలో ప్రతి భాగం కూడా ఏదో రకంగా ఉపయోగపడుతుందని వివరించారు. చైనాలో వెదురు పంటతో 50 శాతం నుంచి 70 శాతం వరకు ఉత్పత్తులను తయారు చేస్తున్నారని చెప్పారు. మన దగ్గర కూడా సాగు తక్కువగా ఉండటం, సరైన ప్రాసెసింగ్ యూనిట్లు, అనుబంధ పరిశ్రమలు లేకపోవటం, ట్రాన్స్‌పోర్టులో సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారాయనీ, ఆ సమస్యలను పర్కిరించుకుని ముందుకెళ్తే వెదురు ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరుగుతుందని తెలిపారు. ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో వెదురు వినియోగానికి గొప్ప అవకాశముందని చెప్పారు. వెదురు పాడైపోని వస్తువన్నారు. ఒకసారి పంట వేస్తే 30 నుంచి 60 ఏండ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందనీ, వరితో పోలిస్తే సాగు ఖర్చు కూడా చాలా తక్కువ అని వివరించారు. సీఐపీఎస్ డైరెక్టర్ అచలేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వెదురు పంట కోయాలంటే అటవీశాఖ, ప్రభుత్వ అనుమతి అవసరం ఉండేదనీ, 2017 నుంచి ఆ నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసిందని తెలిపారు. ఇది వెదురు సాగుకు ఒక ప్రోత్సాహకంగా మారిందన్నారు. వెదురుతో ఫర్నీచర్, అగర్బత్తీలు, అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చుననీ, గృహనిర్మాణ రంగంలోనూ విరివిగా వాడొచ్చని తెలిపారు.