Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బలమైన ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆపార్టీ ప్రజాసంఘాల బాధ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన ఏడున్నరేండ్ల కాలంలో మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి వైషమ్యాలు పెంచుతూ పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. ప్రజలపై ఫాసిస్టు దాడులకు దిగి అత్యంత నిరంకుశ పద్ధతులకు పాల్పడుతున్నదని అన్నారు. కార్పొరేట్ శక్తులకు, విదేశీ బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా మోడీ వ్యవహరిస్తున్నారని చెప్పారు. అమూల్యమైన దేశ సంపదను వాటికి కట్టబెడుతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందనీ, దళితులు, గిరిజనులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరలు, నిత్యావసరాల సరుకుల ధరలు అమాంతం పెరగడంతో సామాన్య జనం అల్లాడుతున్నారని చెప్పారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ధరణి లాంటి ఎన్నో ప్రజా సమస్యలు పేరుకుపోయాయన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఇలాంటి ప్రజా వ్యతరేక విధానాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె కాంతయ్య, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్, బీసీ హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి పాండురంగచారి, తెలంగాణ ప్రజానాట్య మండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, పల్లె నరసింహ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ స్టాలిన్, శివరామకష్ణ, నాయకులు శ్రీమాన్ మర్రి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలీ ఉల్లాV్‌ా ఖాద్రి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.