Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యర్థాలకు నిప్పు పెడుతున్న రైతులు..
- కాలుతున్న మొక్కలు పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ - మదనాపురం / ఉండవెల్లి
పచ్చదనంతో పల్లెలు విరజిల్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మొక్కలు కాలిపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా అగ్నికి ఆహుతి అవుతున్నాయి. పంట చేలల్లోని చెత్తాచెదారాన్ని గట్లపై వేసి రైతులు నిప్పు పెడుతుండటంతో హరితహారం మొక్కలూ కాలిపోతున్నాయి. అధికారులు స్పందించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని నెల్విడి, నర్సింగాపురం, గోవిందహళ్లి గ్రామాల్లో, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తా నుంచి రాయచూర్ వెళ్లే రహదారిలో మొక్కలు నాటారు. ప్రతి రోజూ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు పోసి రక్షిస్తున్నారు. అయితే పర్యవేక్షణ లేకపోవడంతోనే.. స్థానికుల అవగాహనా లోపంతో అగ్నికి ఆహుతి అవుతున్నాయి. వేసవి కావడంతో ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ పొలంలోని పిచ్చి మొక్కలు, ఎండు గడ్డి, కట్టెలను ఏరేసి గట్ల చివరన కుప్పగా పోసి అంటుపెడుతున్నారు. అలాగే అలంపూర్ చౌరస్తా నుంచి రాయచూర్ వెళ్లే రహదారి వెంట గుర్తు తెలియని వ్యక్తులు బీడీలు, సిగరెట్లు తాగి రోడ్డు పక్కన వేయడంతో మంటలు వ్యాపించి మొక్కలు కాలిపోతున్నాయి. అధికారులు స్పందించి నాటిన మొక్కలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.