Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు నుంచి వచ్చే కేసుల్లోనే మరణాల రేటు ఎక్కువ
- వైద్య సిబ్బంది ఆశ్రద్ధ, నిర్లక్ష్యం కనిపించలేదన్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
- తెలంగాణ పౌర స్పందన వేదిక బృందం నీలోఫర్ సందర్శన
నవతెలంగాణ- సిటీబ్యూరో
ప్రయివేటు ఆస్పత్రుల్లో కన్నా ప్రభుత్వ ఆస్పత్రి నీలోఫర్‌లోనే అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయనీ, ఏ స్థాయి వైద్యం అవసరమో.. ఆ వైద్యం అందిస్తున్నారనీ తెలంగాణ పౌర స్పందన వేదిక(టీపీఎస్వీ) రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో బుధవారం 12 మంది శిశువుల మరణించారన్న వార్త రావడంతో.. వాస్తవ పరిస్థితి పరిశీలనకు గురువారం టీపీఎస్వీ తరపున ప్రతినిధులు నీలోఫర్ ఆస్పత్రిని సందర్శించారు.. ఈ బృందంలో రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రాధేశ్యామ్, కోశాధికారి ఎం.అంజనేయులు, ఉపాధ్యక్షులు కె.లక్ష్మణరావు, రాష్ట్ర సలహాదారు ఎం.ఏ.కె దత్తు ఉన్నారు. ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ వి.మురళీకృష్ణను కలిసి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఐసీయూ వార్డులను సందర్శించారు. ఆస్పత్రికి బయట నుంచి ఎక్కువగా ట్యూబ్, పంప్ చేసి ఉన్న సీరియస్ కేసులు వస్తున్నాయని, అలాంటి కేసుల్లోనే మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని టీపీఎస్వీ బృందానికి సూపరింటెండెంట్ వివరించారు. ఇక్కడ పుట్టే కేజీ, కేజీన్నర పిల్లలు కూడా బాగుంటున్నారని, నెలలు నిండని పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు ప్రభుత్వం రూ.పది వేల ఇంజక్షన్.. మొత్తం మూడు డోసులను ఉచితంగా అందిస్తుందని చెప్పారు. నవజాత శిశువులకు మూడు దశల్లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ 32 మంది జూనియర్ డాక్టర్లు డ్యూటీలో ఉంటారని, 368 స్టాఫ్ నర్సులకు ప్రస్తుతం 106 మంది పనిచేస్తున్నారని.. జోనల్ విధానంలో సొంత జిల్లాలకు వెళ్లిన 130 మంది నర్సింగ్ స్టాఫ్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. తల్లిపాల బ్యాంకు ఏర్పాటు చేశామని, రూ.10లక్షల వెంటిలెటర్లు ఉన్నాయనీ, ఇప్పుడున్న వెయ్యి బెడ్లకు మరో 600 బెడ్లు జోడించి ఆస్పత్రి సామర్థ్యాన్ని 1600కు పెంచుతున్నామని చెప్పారు. పిల్లలకు సంబంధించి అన్ని రకాల జబ్బులకు ఇక్కడే వైద్యం అందిస్తున్నామని టీపీఎస్వీ బృందానికి మురళివృష్ణ వివరించారు.
అనంతరం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఏ ప్రయివేటు ఆస్పత్రిలో లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయని, ఆస్పత్రిలో వసతులు, సేవలు బాగానే ఉన్నట్టు గమనించామన్నారు. నవజాత శిశువులకు మూడంచెలలో వైద్య సేవలు అందుతున్నాయని, మూడో దశలో ఉన్న శిశువుల్లో మరణాల సంఖ్య కొంత ఎక్కువగా ఉన్నాయని తెలిసిందన్నారు. నీలోఫర్‌లోనే జన్మించిన శిశువుల్లో ఈ రకమైన మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. కిలో లోపు బరువుతో జన్మించి ఊపిరితిత్తుల సమస్య తీవ్రంగా ఉన్న పిల్లలకు రూ.10వేల విలువైన ఇంజక్షన్లు ఇస్తున్నారని, ఆధునాతన సాంకేతిక పరికరాలు, సేవలు అందుబాటులో ఉన్నట్టు గుర్తించామన్నారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త క్యాడర్ ఎలాట్‌మెంట్‌లో భాగంగా ఒకేసారి 138 మంది నర్సులను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల.. నర్సుల కొరత తీవ్రంగా ఉందన్నారు. డిప్యూటేషన్ సమస్యకు పరిష్కారం కాదనీ, ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ద్వారా తగు సంఖ్యలో నర్సుల రిక్రూట్మెంట్ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. నీలోఫర్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.