Authorization
Sat March 22, 2025 09:46:30 am
- బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, రాకేశ్ టికాయత్‌తో కేసీఆర్ భేటీ
- తాజా రాజకీయాంశాలపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశానికి కాంగ్రెస్, బీజేపీియేతర రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక అత్యవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఆ రెండు పార్టీల పాలనలో దేశం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని చెప్పారు. అభివృద్ధి పథంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదనీ, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం 12,తుగ్లక్ రోడ్‌లోని ఆయన నివాసంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్‌లతో సంయుక్తంగా సమావేశమయ్యారు. ఇరువురు నేతలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్... తాజా రాజకీయ పరిస్థితులు, దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలు, దేశ ఆర్ధిక పరిస్థితి, రాజకీయ, రక్షణ అంశాలు, వ్యవసాయం, ఆరోగ్యం తదితర ప్రాధాన్యాతాంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల దేశం ఆర్ధికంగా దిగజారుతున్నదనీ, పేదల బతుకులు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర వైఫల్యాలను ఎత్తిచూపుతూ వాటిని ఏ విధంగా అధిగమించవచ్చొ కేసీఆర్ వివరించారు. దేశంలో బీజేపీ ప్రభ క్రమేపీ మసకబారుతున్నదనీ, ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని అభిప్రాయపడ్డారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు కృషి చేస్తున్నాయనీ, ఆయా పార్టీల నేతలతో కూడా మాట్లాడుతున్నట్టు కేసీఆర్ తెలిపారు. పంట ఉత్పత్తుల మద్దతు ధర చట్టంపై ఇప్పటివరకు క్లారిటీ లేదనీ, విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తే రైతులు కోలుకోలేరన్నారు. తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసే ప్రసక్తేలేదని కేంద్రానికి కుండబద్దలు కొట్టినట్టు పేర్కొన్నారు. నదుల అనుసంధానం, అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీలు, తదితర అంశాల్లో కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. చాలా అంశాల్లో కేసీఆర్ అభిప్రాయాలతో ఏకీభవించిన సుబ్రహ్మణ్య స్వామి..దేశ ఆర్ధిక మందగమనంపై విశ్లేషణ చేశారు. కరోనా కారణంగా దేశ ఆర్ధిక రంగం కుప్పకూలిందని చెప్పారు. కేసీఆర్ కృషి చేస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కూర్పుకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. రైతు వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టేందుకు దేశ రైతాంగాన్ని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ ఏకతాటిపైకి తీసుకొచ్చారని సీఎం తెలిపారు. రైతు ఉద్యమం సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందనీ, అప్పటి పరిస్థితులను టికాయత్ గుర్తుచేశారు. ఉద్యమంలో అమరులైన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ 3లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించినందుకు సీఎం కేసీఆర్్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నాటకాలాడుతున్నదని టికాయత్ విమర్శించారు. దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సాగు, మార్కెటింగ్ సమస్యలపై ఇరువురు చర్చించారు. సుబ్రహ్మణ్యస్వామికి సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్, వినోద్‌కుమార్ సాదర స్వాగతం పలకగా, టికాయత్‌కు ఎమ్మెల్సీ కవిత స్వాగతం పలికారు.