Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ్మినేని, చెరుపల్లి, మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి,తదితరులు
- ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, డాక్టర్లతో ఆరా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నేత మల్లు స్వరాజ్యంను పలువురు రాజకీయ నాయకులు గురువారం పరామర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె బాబురావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి కె జానారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పరామర్శించారు. వారు ఆస్పత్రిని సందర్శించి కుటుంబ సభ్యులు మల్లు నాగార్జునరెడ్డి, మల్లు లక్ష్మి, మల్లు గౌతంరెడ్డి, మల్లు అరుణ్, పాదూరి కరుణ, ఆదిత్యతోపాటు డాక్టర్లను ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వయో భారంతోపాటు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెను బుధవారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై డాక్టర్లు చికిత్స అందిస్తున్నారనీ, ఆరోగ్యం కొంత మెరుగుపడిందని కుటుంబ సభ్యులు వివరించారు. అయినా ఇంకా వేచిచూడాలని డాక్టర్లు చెప్పారన్నారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు తమ్మినేని, జగదీశ్‌రెడ్డి, జానారెడ్డి కోరారు.
రెడ్‌సెల్యూట్ అన్న స్వరాజ్యం
మల్లు స్వరాజ్యంను పరామర్శించేందుకు ఆస్పత్రికి చెరుపల్లి సీతారాములు రెడ్‌సెల్యూట్ అని అన్నారు. దానికి ఆమె స్పందించి చేతిని పైకెత్తి పిడికిలి బిగించి రెడ్‌సెల్యూట్ అని తిరిగి చెప్పారు. అనారోగ్యంతో ఉన్నా కదల్లేని పరిస్థితిలోనూ ఆమె పోరాట స్ఫూర్తిని కనబరిచారు. ఎర్రజెండా ఔన్నత్యాన్ని చాటారు.