Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్
- సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఒకరోజు బంద్ సక్సెస్
- చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
బతుకమ్మ చీరలు నేసిన ఆసాములకు, కార్మికులకు ఈనెల 20వ తేదీలోగా యారన్ సబ్సిడీ చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు. యారన్ సబ్సిడీ, పింజర్ల, డాబీల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఒక్కరోజు వస్త్రపరిశ్రమ బంద్ నిర్వహించారు. చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కూరపాటి రమేష్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరలు నేస్తున్న కార్మికులు కూలి పెంచాలని సమ్మె చేస్తే ప్రభుత్వం పెంచలేదన్నారు. కార్మికులకు, ఆసాములకు యారన్ సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు 2018 యారన్ సబ్సిడీ మాత్రమే ఇచ్చారని తెలిపారు. 2019, 2020, 2021కి చెందిన యారన్ సబ్సిడీ అందించడంలో చేనేత జౌళి శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల ఉత్పత్తితో కార్మికులకు మూడు నెలలు మాత్రమే ఉపాధి లభిస్తుందన్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం సబ్సిడీ చెల్లిస్తే కార్మికులకు కొంతమేరకు లాభం చేకూరుతుందన్నారు. కాలయాపన చేయకుండా 2019, 2020 యారన్ సబ్సిడీ ఈ నెల 20లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 21 నుండి ఆసాములు, కార్మికులు
20లోగా దారం సబ్సిడీ చెల్లించకపోతే సమ్మె నిరవధిక సమ్మెకు వెళ్తారని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, సీఐటీయూ జిల్లా నాయకులు ఎగమంటీ ఎల్లారెడ్డి, మోర అజరు, గోవిందు లక్ష్మణ్, ఆసాముల సమన్వయ కమిటీ నాయకులు సిరిసిల్ల రవీందర్, చేరాల అశోక్, మండల రాజు, ఆరకాల ఆనంద్, కొండ సుభాష్, పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పాలిస్టర్ ఆసాములు, కార్మికులకు కూలి పెంచాలి..
సిరిసిల్లలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తికి చెందిన ఆసాములు, కార్మికులకు కూలి పెంచాలని ర్యాలీ నిర్వహించారు. పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం ఎదుట ధర్నా చేశారు. అనంతరం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చారు. ఒప్పందం ముగిసి నాలుగు సంవత్సరాలు అవుతుందని, వెంటనే పెంచకపోతే ఈ నెల 20నుంచి సమ్మెకు వెళ్తామని తెలిపారు.