Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీనికి ఒక అంతర్జాతీయ నేపథ్యం ఉంది
- తన ఆధిపత్యానికి గండిపడితే సహించలేని అమెరికా
- 'ఉక్రెయిన్ పరిణామాలు- వాస్తవాలు' వెబినార్‌లో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
- అమెరికా నోట చర్చల మాటేది...? : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉక్రెయిన్, రష్యా మధ్య ప్రస్తుతం జరుగుతున్నది కేవలం ఒక చిన్న సాయుధ సంఘర్షణ మాత్రమే కాదనీ, అది ప్రపంచ దేశాలన్నీ క్షుణ్నంగా పరిశీలించాల్సిన అంశమని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య జరగుతున్న ఘర్షణకు జాతీయ, అంతర్జాతీయ నేపథ్యమున్నదని ఆయన వివరించారు. ఇందుకు సంబంధించి ఆ రెండు దేశాలు మున్ముందు ఎలాంటి వైఖరులు తీసుకుంటాయి.. వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరిస్తాయో చూడాలని అన్నారు. అప్పుడే దీనిపై ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యం బలహీనపడటాన్ని అమెరికా స్వీకరించలేదనీ, ఇప్పటి పరిస్థితికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని ఆయన వివరించారు.
'ఉక్రెయిన్ పరిణామలు- వాస్తవాలు...' అనే అంశంపై సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం వెబినార్‌ను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాఘువులు ప్రధాన వక్తగా మాట్లాడుతూ... ఉక్రెయిన్, రష్యా మధ్య తలెత్తిన ప్రస్తుత పరిణామాలకు గల కారణాలను, ఇందులో అమెరికా, నాటో జోక్యాలను, వైఖరులను సోదాహరణంగా వివరించారు. తమ దేశానికి నాటో వల్ల ప్రమాదం, రక్షణకు ఇబ్బంది లేనంత వరకూ ఉక్రెయిన్ను ఇబ్బంది పెట్టకూడదనే వైఖరిని రష్యా గతంలో తీసుకుందని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందని అన్నారు. నాటోను విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తుండటం, ఈ క్రమంలో తనకు అతి దగ్గరగా ఆనుకుని ఉన్న ఉక్రెయిన్‌లో కూడా నాటో విస్తరణకు ప్రయత్నాలు జరుగుతుండటం వల్ల రష్యా సైనిక చర్యకు పూనుకుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మొదటి దశలో ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలు, మిలట్రీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఆయుధాలను ప్రయోగించిందని చెప్పారు. తాజాగా అధికారిక, ప్రభుత్వ కార్యాలయాలపై రష్యా సైన్యాలు దాడులు సాగిస్తున్నాయని వివరించారు. ఇక్కడ తన రక్షణకు ఆటంకం లేకుండా చూడటం, నాటో విస్తరణను అడ్డుకోవటమనే లక్ష్యాలతోనే రష్యా వ్యవహరిస్తున్నదని అభిప్రాయపడ్డారు. దాని అంతిమ లక్ష్యం (నాటో విస్తరణను అడ్డుకోవటం) త్వరగా పూర్తయి, అక్కడి నుంచి సైన్యాలు వెనుదిరగాలని ఆకాంక్షించారు. ఒకవేళ రష్యా మరింత దూకుడుగా వ్యవహరించి, ఉక్రెయిన్‌లోని ప్రజా సమూహాల మీద కూడా దాడులు చేస్తే... అప్పుడు అది ఆక్షేపించాల్సిన విషయమే అవుతుందన్నారు. తమ్మినేని మాట్లాడుతూ... ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి కావాలంటూ ఘోషిస్తుంటే, అమెరికా నోట మాత్రం ఆ మాటే రావటం లేదన్నారు. నాటో సేనలు తన భద్రతకు, రక్షణకు ఆటంకం కలిగించకుండా అడ్డుగా ఉన్న ఏకైక దేశం ఉక్రెయినే అనే విషయం రష్యాకు బాగా తెలుసన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అమెరికా ప్రోద్బలం, నాటోను విస్తరించాలన్న దాని కాంక్ష ఫలితంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలో ఇతర దేశాలతోపాటు మన దేశం కూడా తటస్థ వైఖరిని తీసుకుందని చెప్పారు. మోడీ సర్కార్ తనకున్న ఇతరత్రా కారణాల రీత్యా యుద్ధం వద్దు, శాంతి కావాలని కోరుతున్నదని వివరించారు. ఏదేమైనా ఈ యుద్ధ వాతావరణం వల్ల కేవలం ఉక్రెయిన్, రష్యాకే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పారు. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక, ఆహార, ఆరోగ్య సంక్షోభాల మూలంగా ప్రతీ దేశం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మనలాంటి దేశాల్లో పెట్రో ఉత్పత్తులు, వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ఇది ప్రజలపై మరిన్ని భారాలు మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఉక్రెయిన్, రష్యా మధ్య ఈ ఘర్షణ వాతావరణం త్వరగా ముగియాలని తమ్మినేని ఆకాంక్షించారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ ఈ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేశారు.