Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జుండ్ సినిమా వివాదం కేసులో హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తన కథను కాపీ చేసి అమితాబ్ బచ్చన్ ప్రముఖ పాత్రలో జుండ్ సినిమాను నిర్మించారంటూ కథా రచయిత చిన్ని ప్రకాష్ రిట్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సినిమా రిలీజ్ అవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్‌ను కొట్టేసింది. ప్రయివేటు వ్యక్తులకు వ్యతిరేకంగా రిట్ వేయడాన్ని తప్పుపట్టింది. కింది కోర్టులో కేసు వేసి రూ.5 కోట్లు తీసుకుని రాజీ చేసుకోవడం, తిరిగి సినిమా రిలీజ్ సమయంలో రాజీ ఒప్పందాన్ని రద్దు చేయాలని మళ్లీ కింది కోర్టుకు వెళ్లడం వంటి విషయాలు రహస్యంగా ఉంచిన చిన్న ప్రకాష్‌కు రూ.10 లక్షల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లో పీఎం కరోనా సహాయ నిధికి చెల్లించాలని, చెల్లించకపోతే ఆ మొత్తాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆర్ఆర్ చట్టం ప్రకారం చిన్ని ప్రకాష్ నుంచి రాబట్టి చెల్లించాలని తీర్పు చెప్పింది. అఖిలేష్ పాల్ రాసిన కథపై తనకు హక్కులు ఉన్నాయని, అయితే ఈ కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించారని గతంలో చిన్ని ప్రకాష్ కూకట్పల్లి కోర్టులో దావా వేశారు. ఈ కేసులో సినిమా విడుదల కాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా పొందారు. తర్వాత చిన్న ప్రకాష్‌కు రూ.5 కోట్లు పరిహారంగా తీసుకునేందుకు టీ-సిరీస్‌తో ఒప్పందం చేసుకున్నారు. కింది కోర్టులో కేసును కూడా ఉపసంహరించుకున్నారు. సినిమా రిలీజ్ అవ్వబోతున్న తరుణంలో మళ్లీ కింది కోర్టుకు వెళితే ఇంజక్షన్ ఆర్డర్ రాలేదు. దీంతో హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. ఈకేసులో కింది కోర్టులోని వివరాలు పేర్కొనకుండా రహస్యంగా ఉంచారని చీఫ్ జస్టిస్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పిటిషనర్‌కు పెద్ద మొత్తంలో జరిమానాను విధించింది.