Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లోర్‌లీడర్‌గా మార్చాలనే డిమాండ్తోనేనా?
- సమావేశమే కారణమా?
నవతలెంగాణ బ్యూరో-హైదరాబాద్
పైకి వాతావరణం మంచిగానే కనిపిస్తున్నా.. నేతలు వేదికలను పంచుకుంటున్నా.. లోలోపల ఆధిపత్య పోరు కొనసాగుతున్నదనే విషయం బీజేపీ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను చూస్తే అర్ధమవుతున్నది. బండి వర్సెస్ సీనియర్ల పంచాయతీ ఓ కొలిక్కి వచ్చిందనుకునేసరికి మరో సమస్య వచ్చి పడింది. శుక్రవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి రఘునందన్‌రావు హాజరు కాలేదు. ఉన్నదే ముగ్గురు సభ్యులు..అందులో ఒకరు గైర్హాజరు కావడమే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రఘునందన్‌రావు ఓ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనాల్సి రావడంతోనే హాజరు కాలేదని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నప్పటికీ ప్లోర్‌లీడర్‌గా రాజాసింగ్ ఉండటం ఆయనకు ఇష్టం లేదనే చర్చ నడుస్తున్నది.
బీజేపీ ఎల్పీ నేతగా ఉన్న రాజాసింగ్‌కు అసెంబ్లీలో స్పీకర్ సమయం ఇస్తున్నప్పటికీ విధానపరంగా కీలకమైన సమస్యలను సభకు ఎత్తిచూపడంలో తెలుగు భాష మీద అంతగా పట్టులేని ఆయన విఫలమవుతున్నారనే చర్చ జనరల్‌గా ఉంది. మిగతా సభ్యులైన ఈటల రాజేందర్, రఘునందన్‌రావు ఏదైనా అంశంపై మాట్లాడేందుకు ముందుకురాగా..నాలుగైదు నిమిషాల సమయమే ఇస్తున్న పరిస్థితి. అందులో అధికార పార్టీ సభ్యుల కామెంట్లను తిప్పికొడుతూ..విషయాన్ని ఎత్తిచూపేందుకు వారికి ఆ సమయం సరిపోవట్లేదు. అదనపు సమయం అడిగితే ఇప్పటికే మీ ఫ్లోర్ లీడర్ చాలా సమయం తీసుకున్నారు కాబట్టి ముగించాలని స్పీకర్‌తో పదేపదే చెప్పించుకోవాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలోనే ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న రాజాసింగ్ మార్చాలనే అభిప్రాయాన్ని రఘునందన్ వ్యక్తం చేస్తూ వస్తున్నారనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో రఘునందన్‌రావు సమావేశానికి హాజరుకాలేదనే ప్రచారమూ జరుగుతున్నది. అయితే, ప్రోగ్రాం ఉండటం వల్లనే ఆయన వెళ్లలేదనే చెప్పటం విడ్డూరంగా ఉంది. అసెంబ్లీలో ఏయే అంశాలపై మాట్లాడాలనేది శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించారు. అలాంటి కీలక సమావేశానికి రఘునందన్‌రావు గైర్హాజరు కావడం, వేరే రోజు సమావేశం నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ అధిష్టానం ఈ రోజే నిర్వహించడం వంటి పరిణామాలను చూస్తే బీజేపీలో అనైక్యత మరింత పెరుగుతుందా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది.