Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సంయమనంతో ముందుకు సాగుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, షార్ట్ డిస్కషన్స్తో సహా అవకాశం దొరికిన ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ హితబోధ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో జరిగింది. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు, నిధుల దారి మళ్లింపు, ఖర్చు చేసిన వివరాలపైనా చర్చకు అస్త్రశస్త్రాలతో సిద్ధంకావాలని సూచించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భ్రుతి, 317 జీవో, పోడు భూములు, యాసంగిలో ధాన్యం కొనుగోలు, పంట నష్టపరిహారం, కొత్త రేషన్ కార్డులు, ఆసరా ఫించన్లు, మద్యంతోపాటు విద్యావైద్య వ్యవస్థలోని లోపాలవల్ల ప్రజలపై పడుతున్న భారాలను సభలో చర్చకు లేవనెత్తాలన్నారు. టీఆర్ఎస్ ట్రాప్లో పడకుండా ప్రజా సమస్యలపైనా, ఏడేండ్లలో టీఆర్ఎస్ వైఫల్యాలపైనా ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ రోజురోజుకూ బలహీనపడుతుండటం, బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ స్ట్రాటజిస్ట్ పీకే టీంతో కలిసి బీజేపీని బదనాం చేసే కుట్రలు చేస్తున్నారనే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.