Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగత లబ్దిపొందే విధానం సమూలంగా మారాలి
- గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక న్యాయం కోసం కేటాయింపులుండాలి
- సమస్యలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలి
- వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతోనే రాజకీయ ప్రత్యామ్నాయం
- రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అవసరం
- ఎన్నికల ముందు కేసీఆర్ ఫ్రంట్ ముందుకుపోయేది కాదు : నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
ప్రజల జీవితాలు మారేలా, జీవన ప్రమాణాలు పెరిగేలా రాష్ట్ర బడ్జెట్‌ను, పథకాలను రూపొందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. వ్యక్తిగతంగా లబ్దిపొందే పథకాల విధానంలో సమూలంగా మార్పు రావాల్సిన అవసరముందని సూచించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయరంగాలు అభివృద్ధి చెందేలా, సామాజిక న్యాయం జరిగేలా, దళితులు, గిరిజనులు, చేతివృత్తిదారులు, చేనేత, గీత కార్మికులు, రకరకాల వృత్తులు చేసుకునే వారు అభివృద్ధి చెందేలా బడ్జెట్లో కేటాయింపులుండాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతోనే రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని వివరించారు. రాష్ట్ర సమగ్రాభివద్ధికి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అవసరమనీ, మహాజన పాదయాత్ర సందర్భంగానే అది ప్రజల ముందుంచామని గుర్తు చేశారు. ఎన్నికల ముందు రాజకీయ ఫ్రంట్ సక్సెస్ కాబోదనీ, జాతీయస్థాయిలో కేసీఆర్ ఏర్పాటు చేసేదీ ముందుకుపోయేది కాదని అభిప్రాయపడ్డారు. ఈనెల ఏడో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు తమ్మినేని వీరభద్రం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్లో ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటారు?
బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వం గతంలో చేసిన పొరపాట్లను సవరించుకోవాలి. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక న్యాయం జరిగేలా కేటాయింపులుండాలి. దళితులు, గిరిజనులు, చేతివృత్తిదారులు, చేనేత, గీత కార్మికులతోపాటు ఇతర వృత్తులకు చెందిన వారు అభివృద్ధి చెందాలి. గతంలో ప్రభుత్వాలు వృత్తుల కోసం కార్పొరేషన్ల పేరుతో రుణాలు, ఆర్థిక సహాయం చేసేది. అయితే ఈ ప్రభుత్వం వాటికి నిధులను తగ్గించింది. వ్యక్తిగతంగా లబ్దిపొందే పథకాలను అమలు చేస్తున్నది. ఇది సమూలంగా మారాలి. సాగునీటి రంగానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టుల కోసం ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నది. ఆంధ్ర, తెలంగాణ మధ్య దీనిపైనే వివాదం తలెత్తింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఆంధ్రలో ప్రాజెక్టుల కోసం ఎక్కువ నిధులు ఇస్తున్నదీ, అందుకే తెలంగాణ అభివృద్ధి కావడం లేదన్న విమర్శలొచ్చాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతున్నది. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ప్రాజెక్టుల కోసం కేటాయింపులు సరిగ్గా ఉండడం లేదు. అందువల్ల ఆయా జిల్లాలకు తగినన్ని నిధులు కేటాయించాలి. జిల్లాల వారీగా ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు ఖర్చు చేయాలి. ఎన్నెండ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తారో నిర్దిష్టంగా అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు కృష్ణా, గోదావరి నుంచి తెలంగాణకు ఎన్ని టీఎంసీల నీరు వాడుకునే అవకాశముందో వివరించాలని ప్రభుత్వాన్ని కోరాం. ఇప్పుడు ఆ నీటిని జిల్లాల వారీగా పంపిణీ చేయాలి. ఏ జిల్లాకు ఎన్ని టీఎంసీల నీళ్లు వస్తాయో, అందుకనుగుణంగా ఏ ప్రాజెక్టులు నిర్మిస్తారో చెప్పాలి.
అసెంబ్లీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఏయే సమస్యలపై చర్చించాలంటారు?
అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చ జరగాలి. ఆసరా పింఛన్ల దరఖాస్తులను నిరంతరం పరిశీలించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. 57 ఏండ్లు నిండిన వృద్ధులందరికీ పింఛన్ ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికే ఇవ్వాలన్న నిబంధన సరైంది కాదు. కార్మికులకు కనీస వేతనాలను సవరించాలి. ఇబ్రహీంపట్నంలో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి హత్య ధరణి వల్లే జరిగింది. రిజిస్ట్రేషన్ ఆధారంగా మ్యూటేషన్ చేయాలి. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాలను పరిష్కరించాలి. పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం మాటతప్పింది. గిరిజనులపై దాడులను ఆపాలి. పోడు భూములపై సీఎం వైఖరి ప్రకటించాలి. ఇచ్చిన మాట ప్రకారం పట్టాలివ్వాలి. కూలిరేట్ల సమస్యలు పరిష్కరించాలి. కౌలురైతులను ప్రభుత్వం గుర్తించాలి. వ్యవసాయం చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలి. దళితబంధు అమలుపై ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలి. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె పూనుకుంటామని చేనేత కార్మికులు చెప్తున్నారు. సీఎం దీనిపై స్పందించి వివరణ ఇవ్వాలి. ప్రభుత్వం తొలగించిన మేట్లు, వీఆర్ఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. వారి సమస్యలు పరిష్కరించాలి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ప్రకటించాలి. నిరుద్యోగ భృతి అమలు చేయాలి. ఏటా ఖాళీల భర్తీకి క్యాలెండర్‌ను ప్రకటించాలి. కానీ ప్రభుత్వం ఎన్నికలొచ్చినప్పుడే భారీ ప్రకటనలు ఇస్తున్నది. ఆ తర్వాత మరిచిపోతున్నది. ఈ సమస్యలన్నింటిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలి.
తాత్కాలిక ప్రయోజనాలకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. అంటే ఓట్లు వచ్చే పథాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నది. కానీ ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ఆలోచించడం లేదు. దీనిపై ఏమంటారు?
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయంటూ టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్తున్నారు.దానధర్మాలు చేసినట్టుగా ఈ పథకాలున్నాయి.వాటిల్లోనూ చేసింది తక్కువ చెప్పేది ఎక్కువ.అయితే ఆ పథకాలు అమల్లో ఉన్నంతకాలం బాగుం టుంది.వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా, నిధుల్లేకపోయినా ఆ పథకాలు ఆగిపోతే ఇబ్బంది వస్తుంది. ప్రజల జీవితాలు మారేలా పథకాలు రూపొందించాలి. భూమి పంచడం, స్పష్టమైన ఉపాధి/ఉద్యోగం, స్వయం ఉపాధి కల్పనకు ఆర్థిక సహాయం అందించాలి. దళితబంధు తరహాలో ఆర్థిక సాయం చేస్తే వారి బతుకులు మారతాయి. రెండు లేదా మూడెకరాల భూమి పంచితే ఆ కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి బతుకుతుంది.చిన్నదో, పెద్దదో ఉద్యోగం ఇస్తే బతుకులు మారతాయి.ఈ మూడురకాల పనులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆసరా పింఛన్లు, ఎన్నికలప్పుడు కొత్త వరాలు ఇస్తున్నారు. ప్రజలను ఆశలపల్లకిలో ఊరేగిస్తున్నారు తప్ప బతుకులు మారేందుకు ఉపయోగపడుదు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా గతంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు చలో అసెంబ్లీ లేదా చలో హైదరాబాద్ పేరుతో ప్రతిరోజూ కార్యక్రమాలు నిర్వహించేవి? ఇప్పుడవి లేకపోవడానికి కారణమేమంటారు?
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌ను రద్దుచేసింది. ఆ రకంగా బడ్జెట్ సమావేశాలు రాగానే ధర్నాచౌక్‌లో ధర్నా చేయాలన్న ఆలోచన లేకుండా చేశారు. దీంతో ఆ అలవాటు తప్పింది. బడ్జెట్లో కేటాయింపులు జరిగితే ఖర్చు చేస్తారన్న నమ్మకం గతంలో ఉండేది. అందుకే ఒత్తిడి కోసం ధర్నాలు జరిగేవి. ఇప్పుడు కేటాయింపులు బ్రహ్మాండంగా చూపిస్తున్నారు. తర్వాత పద్దులు మారిపోతున్నాయి. బడ్జెట్లో కేటాయిస్తే ఖర్చు చేస్తారన్న నమ్మకం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో నిర్బంధం కొనసాగుతున్నది. కరోనా పేరుతో అనుమతి ఇవ్వలేదు. కరోనా తగ్గినా టీచర్ల ధర్నాకు ఇటీవల అనుమతి ఇవ్వలేదు. పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ పార్టీల నాయకులను రానివ్వొద్దంటూ ఆంక్షలు విధిస్తున్నారు. నిర్బంధం, ఒత్తిడి తీవ్రంగా ఉంది. అయినా ధర్నాలు జరగడం లేదన్నది వాస్తవం కాదు. ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే గతంతో పోల్చితే తగ్గాయన్నది కూడా వాస్తవమే.
బంగారు తెలంగాణ తరహాలోనే ఇక బంగారు భారత్ నిర్మించాలని సీఎం కేసీఆర్ అంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటున్నారు. దీనిపై ఏమంటారు?
రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని కేసీఆర్ తొలుత అన్నారు. కాబట్టి రాష్ట్రాల హక్కుల కోసం పోరాడతామన్నారు. దాన్ని సీపీఐ(ఎం) ఆహ్వానిస్తున్నది. కానీ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను కలుపుతాను,జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటున్నారు. దీన్ని రాజకీయాల్లోకి తీసుకుపోవడం సరైంది కాదు. రాష్ట్రాల హక్కుల కోసం జరిగే ఉద్యమాన్ని బలహీనపరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదీ, నిధులను తగ్గిస్తున్నదని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ పోరాడితే రాజ్యాంబద్ధంగా ఉంటుంది. రాజ్యాంగంలో ఫెడరల్ స్వభావం, రాష్ట్రాల హక్కుల గురించి ఉన్నది. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని చట్టాల పేరుతో కేంద్రం లాగేసుకుంది. రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యుత్‌ను తీసుకుంటున్నది. విద్యుత్ సవరణ బిల్లు తెచ్చింది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను నూతన విద్యావిధానాన్ని కేంద్రం తెచ్చింది. పన్నుల అధికారం గతంలో రాష్ట్రాలకు ఉండేది. జీఎస్టీ పేరుతో అధికారాలన్నీ కేంద్రం తీసుకుంది. కేంద్రం దాడులను వ్యతిరేకించడానికి రాష్ట్రాల మధ్య ఐక్యతతో విస్తృతమైన పోరాటం చేయాలి. కానీ ఆ పోరాటాన్ని రాజకీయాలకు ముడిపెడితే ఆ ఉద్యమం బలహీనపడుతుంది. ఎన్నికలకు ముందు ఫ్రంట్ ఏదీ సక్సెస్ కాలేదు. ఎన్నికల తర్వాత సీట్లను బట్టి బీజేపీ అధికారంలోకి రాకుండా ఫ్రంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కేసీఆర్ చెప్పే ఫ్రంట్ ముందుకుపోయేది కాదు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కావాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం గతంలో మహాజన పాదయాత్ర చేశాం. నాలుగువేల కిలోమీటర్లు తిరిగి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందుంచాం. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యావైద్యం, ఉద్యోగాల కల్పన, సాంస్కృతిక రంగంలో అభివృద్ధి ఎలా ఉండాలో చెప్పాం. దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. దానికోసం ప్రయత్నం చేసిన బీఎల్ఎఫ్లో కొన్ని లోపాలు జరిగాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభలో ఆత్మవిమర్శ చేసుకుని సవరించుకున్నాం. భవిష్యత్తులో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను వర్గ సామాజిక శక్తులను సమీకరించి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని మహాసభలో నిర్ణయించాం. ఈ ప్రత్యామ్నాయం కొన్ని పార్టీలను కూడగట్టడం ద్వారా కాకుండా ప్రజల ఉద్యమాల్లో నుంచి పోరాటాల్లో నుంచి వస్తుంది. కూలి, భూమి, కార్మిక సమస్యలు, నిరుద్యోగం, మహిళా సమస్యలు, పట్టణ నివాస సమస్యలు, సామాజిక, సాంస్కృతిక సమస్యలు, విద్యార్థి, యువజన సమస్యల ఆధారంగా పెద్దఎత్తున పోరాటాల్లోకి వెళ్లాలని నిర్ణయించాం. అన్ని జిల్లాల్లో సమావేశాలు జరుగుతున్నాయి. రాబోయే కాలంలో ఏప్రిల్, మే, జూన్‌లో సమస్యల పరిష్కారం కోసం ప్రజా కార్యాచరణ ఉంటుంది.