Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయంపై త్వరలో నిర్ణయం
- జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో కేసీఆర్ భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరంగా, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ప్రయత్నిస్తున్నామనీ, అయితే అది ఇంకా ఖరారు కాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అన్ని పార్టీల నాయకులతో చర్చిస్తున్నామనీ, త్వరలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. దేశ సమగ్రత, లౌకిక విధానాలను పటిష్టపరిచే దిశగా చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులు, ఇతర నాయకులతో కలిసి జార్ఖండ్ రాజధాని రాంచీ వెళ్లారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకున్నారు. వారికి హేమంత్ సోరెన్, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకులు స్వాగతం పలికారు. తాజా జాతీయ రాజకీయాలు, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇరువురు నేతలు చర్చించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా దేశం అనేక రంగాల్లో వెనకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు గత ప్రభుత్వాల వైఫల్యమే కారణమని అభిప్రాయపడ్డారు. మొదట్లో మనకంటే వెనకబడ్డ పొరుగుదేశం చైనా సూపర్ పవర్‌గా దూసుకుపోతున్నదనీ, చాలా ఆసియా దేశాలు మనకంటే ముందున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదని విమర్శించారు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారుతున్నాయనీ, దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతీ భారతీయుడిపై ఉందని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సంస్కరణలు, రాష్ట్రాల పట్ల వివక్ష, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, మైనార్టీలు, దళితులపై దాడులు, రక్షణ అంశాలు, తదితరాలపై ఇరువురు నేతలు చర్చించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ ఈ సందర్భంగా హేమంత్‌కు వివరించారు. బీజేపీ రాజకీయ విధానాలపై హేమంత్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం హేమంత్ కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ దంపతులు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవిత,టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి బోజనం చేశారు.
అమర జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సాయం
గాల్వన్ లోయలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన ఝార్ఖండ్‌కు చెందిన జవాన్లు కుందన్ కుమార్ ఓజా, గణేష్ కుటుంబ సభ్యులకు ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌తో కలిసి రూ.10లక్షల ఆర్ధిక సహాయం అందజేశారు. జేఎంఎం వ్యవస్థాపకులు శిబు సోరెన్‌తో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాంచీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బృందం శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంది.