Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఒప్పించాలి
- దీక్షలను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ- విద్యానగర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, నాయకులు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ఒప్పించాలని స్పష్టం చేశారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణతల్లి చౌక్‌లో కొనసాగుతున్న దీక్షలు పదో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం తాలుకా పద్మశాలి సంఘం నాయకులు కూర్చుకున్నారు. ఈ దీక్షలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ప్రారంభించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వస్తాయన్నారు. ప్రభుత్వపరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తోందన్నారు. బీజేపీ హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు.
కేంద్రానికి లేఖ రాయాలి
సీసీఐని తెరిపించాలని కేంద్రానికి లేఖ రాయాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాలు మల్లేష్ మంత్రి హరీశ్‌రావుకు విన్నవించారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే పారిశ్రామికంగా అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉందన్నారు. సీసీఐని తెరిపించాలనే ఆకాంక్ష స్థానిక ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఆనాడు పరిశ్రమలో ఉద్యోగాలు వస్తాయని నమ్మకంతో అతితక్కువ రేటుకు తమ భూములు ఇచ్చిన నిర్వాసితులు ఫ్యాక్టరీ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. సీసీఐ సాధన కమిటీ గత నెల జనవరి 26 రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసినప్పుడు మూడు హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. వీటికి సంబంధించిన వివరాలను మంత్రికి అందజేశారు.