Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షీ టీంలతో మహిళలకు భరోసా
- పోలీస్ స్టేషన్లకు వెళ్లగానే సమస్యలను వింటున్నారు
- సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి
- ఆదివారం నుంచి మూడు రోజులపాటు మహిళా దినోత్సవ వేడుకలు : విలేకర్ల సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అభయహస్తం పథకాన్ని తమ ప్రభుత్వం ఎత్తేసిన నేపథ్యంలో ఆ పథకానికి సంబంధించిన పూర్తి సొమ్మును వాటాదారులైన మహిళలకు చెల్లిస్తామని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఆ పథకం ద్వారా వచ్చే పింఛన్తో పోలిస్తే... ఇప్పుడిచ్చే ఆసరా పింఛనే ఎక్కువగా వస్తున్నదని వారు తెలిపారు. గతంలో ఎక్కడైనా మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు జరిగితే చెప్పుకోలేని పరిస్థితులు ఉండేవనీ, ఇప్పుడు షీ టీంలు వారికి ఎంతో భరోసానిస్తున్నాయని వివరించారు. ఇప్పుడు మహిళలకు పోలీస్ స్టేషన్లకు వెళితే.. కనీసం సమస్యనైనా వింటున్నారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి మంత్రులు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షపాతి అని ఈ సందర్భంగా వారు అభివర్ణించారు. వడ్డీ లేని రుణాలను అందించటం ద్వారా మొత్తం 40.58 లక్షల మంది మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చారని చెప్పారు. రాష్ట్రంలో అమ్మాయిల కోసం 53 డిగ్రీ కళాలలను ఏర్పాటు చేశామన్నారు. మహిళల కోసమే ప్రత్యేకంగా నాలుగు పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశామని వివరించారు. పోలీస్ శాఖలో సైతం 33 శాతం మహిళా రిజర్వేషన్ను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని తెలిపారు. సీఎం కేసీఆర్... ఇలా స్త్రీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ క్రమంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఆదివారం నుంచి బుధవారం వరకూ మూడు రోజులపాటు మహిళా దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతున్నదని చెప్పారు. కేసీఆర్ చిత్రపటాలు, ఫెక్సీలకు రాఖీలు కట్టటం, కేసీఆర్ కిట్ ద్వారా లబ్దిపొందిన మహిళల కుటుంబాలతో భేటీలు నిర్వహించటం తదితర కార్యక్రమాలను చేపట్టాలని సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.