Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండాలు పాతుతాం
- నీటి వనరుల ఆధారంగా భూ విభజన జరగాలి :
- వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ప్రకృతి వనరుగా వచ్చిన భూములను కొంతమంది రియల్టర్లు పడావు పెడుతున్నారని, ఆ భూముల్లో ఎర్రజెండాలు పాతుతామని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. యాదాద్రి పట్టణంలోని సాహితి కన్వెన్షన్ హాల్లో రెండో రోజు శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలు కొనసాగాయి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా జి.నాగయ్యను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. నీటి వనరుల ఆధారంగా భూ విభజన జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి, పేదల భూములను తక్కువ ధరకు కాజేసి వ్యవసాయం లేకుండా చేశారన్నారు. దీంతో గ్రామాల్లో పేద మధ్యతరగతి ప్రజలకు, వ్యవసాయ కూలీలకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేల ఎకరాల భూమి ఎక్కడ ఉన్నా కనీసం ప్రభుత్వం పేదలకు పంచకపోవడం వల్ల పడావు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నీటి వనరులు అధికంగా ఉన్నా ఇప్పటివరకు నీటి సంస్కరణలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉపాధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఉపాధి హామీ చట్టానికి నిధుల కోత విధిస్తూ నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో భూమి, నీరు, ఉపాధి, విద్య, వైద్యంపై ఉధృత పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే డిసెంబర్లోనే ఎన్నికలకు వెళ్లొచ్చనే చర్చ జరుగుతోందని, ఈ క్రమంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు ఉధృతం చేయాలని అన్నారు. ఏప్రిల్ నుంచి మే వరకు కూలి పోరాటాలు, భూ పోరాటాలు భారీఎత్తున చేయాలని నిర్వహించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడు జి.నాగయ్య మాట్లాడుతూ.. నిరుపేదలకు స్థలం ఉంటే ఇల్లు, కట్టుకోవడాని కి 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. కోవిడ్ తర్వాత పట్టణాల నుంచి గ్రామాలకు వలస వస్తున్నారని, అందరికీ ఉపాధి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం 12 లక్షలు లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు బుర్రి ప్రసాద్, కొండమడుగు నర్సింహా, నారి ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, కందుకూరి జగన్, వెంకటేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ నరసింహులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రోడ్డ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.