Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో భీం జిల్లాకు రెండు డయాలసిస్ కేంద్రాలు : ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 340 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
నవతెలంగాణ-ఆసిఫాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతం చేయడంతోపాటు ఆరోగ్య తెలంగాణ నిర్మించడమే తమ లక్ష్యమని ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఉదయం ఉట్నూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించి జైనూర్ మీదుగా ఆసిపాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అంకుశాపూర్ గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన 340 పడకల ఆస్పత్రి, రేడియాలజీ ల్యాబ్‌కు శంకుస్థాపనతో పాటు సామాజిక ఆస్పత్రిలో చిల్డ్రన్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. అంతకుముందు అంకుశాపూర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో ఏడు చోట్ల ఒక్కొక్కటి రూ.28లక్షలతో చిల్డ్రన్ కేర్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వీటిని 20కి పెంచుతామన్నారు. జిల్లా కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి ఉందని, రూ.60కోట్లతో నిర్మిస్తున్న 340 పడకల ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాకు శాశ్వత ప్రాతిపదికన వైద్యుల కేటాయింపుతోపాటు వారికి అదనంగా అలవెన్సులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. జైనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉన్నతీకరిస్తామని, దీనికోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని తెలిపారు. గ్రామ పంచాయతీలకు రానున్న రోజుల్లో పక్కా భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 80 రహదారులకు అటవీ అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లాలో మెడికల్, నర్సింగ్ కళాశాల, అదనపు అంబులెన్సుల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రికి వివరిస్తామన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 150 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని, అందుకోసం చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. కుమురం భీం ప్రాజెక్ట్ కెనాల్ పనులు పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. జిల్లాలో డయాలసిస్ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ దండే విట్టల్, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్లు వరుణ్‌రెడ్డి, రాజేశం, డీఎంఈ రమేష్‌రెడ్డి, ఎస్పీ సురేష్‌కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాం, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు పాల్గొన్నారు.