Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాలరీస్ డైరెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్ ఉపరితల గనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు కోసం అవసరమైన ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా మరింత మెరుగుపడేందుకు దోహదపడేలా నూతన టెండర్ ప్రక్రియను చేపట్టినట్లు డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్ చెప్పారు. ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా కాంట్రాక్టు విషయంలో కోలిండియా తదితర సంస్థల్లో అవలంబిస్తున్న విధానాలను పరిశీలించిన అనంతరం అత్యంత పారదర్శకత, పూర్తి హేతుబద్ధతతో పలు నిబంధనలను కొత్త టెండర్ లో పొందుపరుస్తున్నామన్నారు. ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరాదారులతో శనివారం నాడాయన హైదరాబాద్ సింగరేణి భవన్లో ప్రీ బిడ్ సమావేశం సందర్భంగా మాట్లాడారు. క్షేత్ర స్థాయి సమస్యలను అధ్యయనం చేసిన తర్వాత పనితీరు ఆధారిత ప్రోత్సాహానికి అవకాశం కల్పించేలా టెండర్ ఆహ్వాన నోటీస్(ఎన్ఐటీ) లో పలు నిబంధనలు చేర్చామన్నారు. నిర్ణీత స్థాయిలో సరఫరా చేయని పక్షంలో పెనాల్టీ విధించడాన్ని కొనసాగిస్తామన్నారు. ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో రష్యా -ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎక్స్‌ప్లోజివ్స్‌కు కావాల్సిన ముడి సరకు అమ్మోనియం నైట్రేట్‌కు కొరత ఏర్పడిరదనీ, దీనితో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నిబంధనలను సరళతరం చేయాలని కోరారు. సమావేశంలో జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కే సూర్యనారాయణ, జీఎం (సీఎంసీ) ఏ రమేశ్‌రావు, జీఎం (ఎక్స్ ప్లోజివ్స్) ఎల్వి సూర్యనారాయణ, జీఎం (స్ట్రాటెజిక్ ప్లానింగ్) జి.సురేందర్, ఏజీఎం (ఫైనాన్స్) రాజేశ్వరరావు, కొత్తగూడెం కార్పోరేట్ ఆఫీస్ జీఎం (ఫైనాన్స్) సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.