Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ సెషన్లో ప్రసంగం లేకపోవడంపై స్పందించిన గవర్నర్
- నాకూ విచక్షణాధికారాలు ఉన్నాయి : తమిళిసై
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈనెల 7వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. సంప్రదాయానికి భిన్నంగా, సాంకేతిక కారణాలను చూపుతూ ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగం లేకుండా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిరోజే ఆర్థిక మంత్రి నేరుగా సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా స్పందించారు. తన ప్రసంగం లేకపోవడం వల్ల గత ఏడాదిగా ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా గవర్నర్ ఏమన్నారంటే...''గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతా యని ప్రభుత్వం మొదట చెప్పింది. ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నా సిఫార్సు కోరింది. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశా. ఆర్థిక బిల్లు సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ నాకుంది. ప్రజా సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకుని సిఫార్సు చేశా. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల శాసనసభ్యుల హక్కులకు విఘాతం ఏర్పడుతుంది. గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారు'' అని పేర్కొన్నారు. ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత శాసనసభ సమావేశమవుతున్నదనీ, దీన్ని టెక్నికల్‌గా 'కొనసాగింపు' అని పేర్కొనడం పట్ల కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ''బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కానీ, ఆ సంప్రదాయాన్ని కొనసాగించకుండా రాష్ట్ర ప్రభుత్వం తన విజ్ఞతతో ఈ సమావేశాలను ఏర్పాటు చేసింది. కొత్త సెషన్ కానందున గవర్నర్ ప్రసంగం లేదని ప్రభుత్వం పేర్కొంది. సాంకేతిక అంశం వల్ల ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రసంగాన్ని తయారు చేయరు. కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తాను ఆర్థిక బిల్లును సిఫార్సు చేసినట్టు గవర్నర్ స్పష్టం చేశారు.