Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్‌రెడ్డికి సాధన సమితి వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు సహకరించాలని జీవో నెంబర్ 16 క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిని సమితి కన్వీనర్ కొప్పిశెట్టి సురేష్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 16 జీవోను జారీ చేసిందని గుర్తు చేశారు. కొందరు హైకోర్టులో కేసు వేయడంతో తాత్కాలికంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కేసు విషయంలో హైకోర్టు స్టేను ఎత్తేసిందని వివరించారు. దీంతో న్యాయస్థానాల్లో అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంతవరకు దీనిపై స్పందించడం లేదని తెలిపారు. క్రమబద్ధీకరణ జరగకపోవడంతో తమ కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది క్రమబద్ధీకరణ జరగకముందే రిటైర్మెంట్ అవుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి క్రమబద్ధీకరణ అయ్యేటట్టు చూడాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, సీనియర్ నాయకులు మల్లు రవి, కాంట్రాక్టు ఉద్యోగులు సత్య (మెడికల్ అండ్ హెల్త్), ఉదరుభాస్కర్ (పాలిటెక్నిక్), ఉదయశ్రీ, శ్రీనివాస్‌రెడ్డి, సంగీత, శోభన్, మనోహర్, మల్లన్న (కాంట్రాక్టు అధ్యాపకులు) పాల్గొన్నారు.
మధుసూదన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండన
ఇంటర్ బోర్డు ప్రతిష్ట దిగజార్చే విధంగా జీజేఎల్ఏ అధ్యక్షులు పి మధుసూదన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (475) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ జబీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
భవిష్యనిధి సొమ్ము చెల్లించాలి : తపస్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు హన్మంత్‌రావు, నవాత్ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. వారి భవిష్యనిధి సొమ్మును ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.