Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి10 నుంచి ఏప్రిల్ 25 వరకు సమస్యలపై సర్వేలు
- దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు : ఎన్పీఆర్డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంతంగా సర్వేలు నిర్వహిస్తామనీ, సమస్యల పరిష్కారం కోసం మార్చి 10 నుంచి ఏప్రిల్ 25 వరకు రాష్ట్రం దశలవారీ ఉద్యమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగులకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వికలాంగులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎనిమిదేండ్లుగా బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేస్తున్నదని గుర్తుచేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 3.51 లక్షల ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ వికలాంగుల స్వయం ఉపాధి కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వికాలాంగుల ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఏప్రిల్ 4న తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 23 ,24 తేదీల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద సామూహిక నిరాహార దీక్ష, 25న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు మహా ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు టి మధు బాబు ,కే యశోద పి కవిత, సహాయ కార్యదర్శులు జర్కొని రాజు, వనం ఉపేందర్, పి బలిశ్వర్ , రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.